ఎదుగూ బొదుగూ లేని గిరిజన సంక్షేమ విద్యాశాఖ
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:27 AM
స్థానిక ఐటీడీఏ పరిధిలో ఉండే గిరిజన సంక్షేమ విద్యా శాఖ(ఉప సంచాలకుల కార్యాలయం) నాలుగు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. 1976లో అప్పటి అవసరాలకు అనుగుణంగా మంజూరు చేసిన పోస్టులతోనే గత 50 సంవత్సరాలుగా కాలం వెల్లదీస్తున్నారు.
- 1976లో మంజూరైన పోస్టులతోనే కాలక్షేపం
మూడింతలు పెరిగిన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు
డిప్యూటేషన్ సిబ్బందితోనే డీడీ కార్యాలయం నిర్వహణ
తాజా పరిణామాలకు తగ్గట్టుగా పోస్టులు మంజూరు చేయాలని టీచర్ల డిమాండ్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
స్థానిక ఐటీడీఏ పరిధిలో ఉండే గిరిజన సంక్షేమ విద్యా శాఖ(ఉప సంచాలకుల కార్యాలయం) నాలుగు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. 1976లో అప్పటి అవసరాలకు అనుగుణంగా మంజూరు చేసిన పోస్టులతోనే గత 50 సంవత్సరాలుగా కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పరిపాలనా పరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉప సంచాలకుల కార్యాలయానికి అవసరమైన పోస్టులు మంజూరు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మన్యం ప్రాంతానికి సంబంధించి గిరిజన బాలలకు ఆశ్రమ విద్యను అందించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉంది. దానికి ఉన్నతాధికారిగా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఉంటారు. దీనిని 1976లో ప్రభుత్వం స్థాపించింది. అప్పట్లో ఏజెన్సీ 11 మండలాల పరిధిలో 56 ఆశ్రమ పాఠశాలలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పట్లో ఉప సంచాలకులు కార్యాలయానికి ఒక సూపరిండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లను మాత్రమే మంజూరు చేశారు. అయితే అప్పట్లో తక్కువ సంఖ్యలో ఆశ్రమ పాఠశాలలు, తక్కువ మంది విద్యార్థులు ఉండడంతో ఇబ్బందులు ఉండేవికాదు. కానీ గత ఐదు దశాబ్దాలుగా గిరిజన ప్రాంతంలో విద్యపై గిరిజనుల్లో ఆసక్తి పెరగడంతో విద్యాలయాల సంఖ్య, విద్యార్థుల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ 50 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది సంఖ్య ఇప్పటికీ ఉంది. దీంతో ఉన్న సిబ్బందిపై పని భారంతోపాటు పరిపాలనా పరంగా సమస్యలు తలెత్తుతున్నాయి.
డిప్యూటేషన్ సిబ్బందితోనే విధులు
ఏజెన్సీలో 117 ఆశ్రమ పాఠశాలలు, 33 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 667 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, సుమారుగా 4 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది, 65 వేల మంది గిరిజన విద్యార్థులున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన జీతాలు, ఇతర రాయితీలు, సర్వీసు వ్యవహారాలు, ఇతర గ్రాంట్‌లు, విద్యార్థుల ఉపకార వేతనాలు, వారికి అవసరమైన సదుపాయాలు, పథకాలను అమలు చేయాలి. ఆయా పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో ఒక సూపరిండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లు మాత్రమే ఉన్నారు. దీంతో ఇతర పాఠశాలల నుంచి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఉప సంచాలకుల కార్యాలయంలో నియమించుకుని అధికారిక పనులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పనులను చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో పని చేయాల్సిన ఉపాధ్యాయేతర సిబ్బంది డీడీ కార్యాలయంలో విధులు నిర్వహించక తప్పడం లేదు.
అదనపు పోస్టుల మంజూరు అనివార్యం
గత ఐదు దశాబ్దాలుగా అప్పటి సిబ్బందితోనే నడుస్తున్న స్థానిక గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయానికి అదనపు పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగ, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుతో పాటు మరొక జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూవో), ఉపకార వేతనాల వ్యవహారాలకు ఒక సూపరింటెండెంట్, సాధారణ వ్యవహారాలకు మరొక సూపరింటెండెంట్, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు ఉండాలని, అలాగైతేనే డీడీ కార్యాలయంలో పనులు సకాలంలో, సక్రమంగా జరుగుతాయని అంటున్నారు. ఈ విధంగా అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.