పడకేసిన పర్యాటకం
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:56 AM
జిల్లాలో పర్యాటకం పడకేసింది. గత ఏడాది పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను కార్యాచరణలోకి తేవడంపైనే ఆ శాఖాధికారులు పనిచేస్తున్నారు.
‘ప్రతి నెలా ఈవెంట్ల నిర్వహణ’ ప్రకటనలకే పరిమితం
విశాఖ ఉత్సవ్ తరువాత ఒక్క కార్యక్రమం కూడా లేదు
ఏడాదైనా అందుబాటులోకి రాని కారవాన్లు
క్రూయిజ్ పర్యాటకంపై కొరవడిన శ్రద్ధ
పూర్తి స్థాయి అధికారులు లేకపోవడమే కారణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పర్యాటకం పడకేసింది. గత ఏడాది పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను కార్యాచరణలోకి తేవడంపైనే ఆ శాఖాధికారులు పనిచేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను తీసుకువచ్చే ఆలోచనలు, ప్రణాళికలు ఏమీ రూపొందించడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు కూడా అమలు చేయడం లేదు.
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్న దృష్ట్యా ఇక్కడ హోటళ్ల సంఖ్య పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంస్థలతో గత ఏడాది పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు చేసుకున్నారు. వారికి అవసరమైన భూములను కలెక్టర్, వీఎంఆర్‌డీఏ అధికారులు కలిసి సమకూర్చాలని ఆదేశించడంతో వారు పర్యాటక శాఖాధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకువెళుతున్నారు. జిల్లా పర్యాటక శాఖాధికారులు ఆ పనులు తప్పించి విశాఖను పర్యాటకంగా కొత్తగా చూపించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.
గత ఏడాది సెప్టెంబరులో మూడు రోజులు బీచ్ రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభించడంతో అప్పటి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యాటక శాఖ నెలకొక ఈవెంట్ నిర్వహించి, ప్రజలు, పర్యాటకులకు ఆహ్లాదం కలిగించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి క్యాలెండర్ కూడా రూపొందించాలని సూచించారు. ఆ తరువాత మూడు నెలల వ్యవధిలో విశాఖ ఉత్సవ్ నిర్వహించారు. నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ఈవెంట్ సంస్థకు అప్పగించి, పర్యాటక శాఖను పర్యవేక్షణకు పరిమితం చేశారు. ఆ షెడ్యూల్‌లో ప్రకటించిన కార్యక్రమాలు ఏవీ పూర్తిగా నిర్వహించలేదు. డ్రోన్ షో లేకుండానే మమ అనిపించారు. ఆ తరువాత నుంచి ఇప్పటివరకూ ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు.
గత ఏడాది సెప్టెంబరులోనే కారవాన్ టూరిజం ప్రారంభిస్తున్నట్టు నాటి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కారవాన్ కూడా విశాఖపట్నం వచ్చింది. అందులో ఎక్కి పర్యాటక శాఖాధికారులు పోజులు ఇచ్చారు. అరకులోయ, లంబసింగితో పాటు పర్యాటకులు ఎక్కడికి కావాలంటే అక్కడికి కారవాన్ నడుపుతామని వెల్లడించారు. అది ఇప్పటివరకూ అందుబాటులోకి రాలేదు. దానిపై మాట్లాడడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పర్యాటక ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. అలాగే విశాఖలోనే ఫిషింగ్ హార్బర్ నుంచి తెన్నేటి పార్కు, రుషికొండ, భీమిలి వరకు బోటు షికారు నిర్వహిస్తామని ఓ సంస్థ ముందుకువస్తే వారికి అనుమతి ఇవ్వలేదు.
విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్లు వెచ్చించి క్రూయిజ్ టెర్మినల్ నిర్మించింది. కార్డిలియో క్రూయిజ్ ఏడాదికి నాలుగైదుసార్లు తప్ప ఇంకే క్రూయిజ్ విశాఖ రావడం లేదు. పోర్టు అధికారులు పర్యాటకంలో తమకు అనుభవం లేదని, పర్యాటక శాఖ దీనిపై చొరవ తీసుకోవాలని సూచిస్తూ పలు సమావేశాలు నిర్వహించారు. విశాఖకు క్రూయిజ్‌లు తీసుకువచ్చే విషయంలో జిల్లా పర్యాటక శాఖ ఏమీ చేయలేకపోతోంది.
రెండు పోస్టుల్లోను ఒక్కరే
జిల్లా పర్యాటక శాఖ అధికారిగా మాధవి గత రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రాంతీయ పర్యాటక శాఖాధికారి పోస్టు ఖాళీ అయితే ఆ బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. రాష్ట్రంలో పర్యాటకంగా విశాఖపట్నం చాలా కీలకమైన నగరం. ఇక్కడ పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం వల్ల ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా అభివృద్ధి జరగడం లేదు. ప్రత్యేకంగా పర్యాటక శాఖకు కార్యాలయాలు ఉన్నా...వాటిలో ఏ అధికారి అందుబాటులో ఉండడం లేదు. నిత్యం కలెక్టరేట్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు. దానికి తగిన ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
సాగని సాగు
తీవ్ర వర్షాభావమే కారణం
జిల్లాలో 60 శాతం లోటు
సాధారణ విస్తీర్ణంలో 35 శాతం మేర మాత్రమే ఈ ఏడాది పంటలు
ఎండిపోయిన చెరువులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తీవ్ర వర్షాభావం ఖరీఫ్ సీజన్‌పై ప్రభావం చూపింది. జిల్లాలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో వ్యవసాయం చాలావరకూ వర్షాధారంపై, కొంత బోర్లపై ఆధారపడి సాగుతుంది. ఈ ఏడాది నాలుగు గ్రామీణ మండలాల్లో వర్షపాతం లోటు సుమారు 60 శాతంగా నమోదైంది. దీంతో 5,331 హెక్టార్లకుగాను కేవలం 1,868 హెక్టార్ల (35 శాతం)లో మాత్రమే పంటల సాగు జరిగినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి 4,778 హెక్టార్లకుగాను 1,432 హెక్టార్లు (29.97 శాతం), నువ్వులు 389 హెక్టార్లకుగాను 356, వేరుశనగ 53 హెక్టార్లకుగాను 14, సజ్జలు 60 హెక్టార్లకుగాను 57 హెక్టార్లలో సాగు చేశారు. బోర్ల ఆధారంతో 1,432 హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో బోర్లు కూడా సరిగా పనిచేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోస్తని నదిలో నీరు లేకపోవడంతో పరీవాహక ప్రాంతాల్లో నాట్లు పడలేదని పద్మనాభం మండలం కృష్ణాపురానికి చెందిన పైడిరాజు అనే రైతు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోగానైనా వర్షాలు కురిసి చెరువులు నిండితే నాట్లు వేయడానికి అవకాశం ఉందన్నారు. కానీ, ఇప్పటికే చాలా వరకు నారుమడులు ఎండిపోయాయన్నారు. వర్షాలు కురవకపోతే బోర్ల కింద వరి సాగు కూడా కష్టమేనని మద్ది గ్రామానికి చెందిన రైతు పేర్కొన్నారు. ఇంకా పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని, వచ్చే వేసవిలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళితే తాగునీటికి కష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆసియా క్రీడలకు ఎర్రాజీ జ్యోతి
గత టోర్నీలో కాంస్య పతకం
ఈసారి స్వర్ణ పతకంపై గురి
విశాఖపట్నం, స్పోర్ట్స్,సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ఎర్రాజీ జ్యోతి మరోసారి ఏషియన్ గేమ్స్‌లో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 4 వరకు జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టుకు జ్యోతి ఎంపికైంది. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ సిల్వర్ మీట్‌లో జ్యోతి కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడలకు అర్హత సాఽధించింది.
స్వర్ణంపై కన్నేసిన జ్యోతి
చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ (2023) లో 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించిన జ్యోతి...త్వరలో జపాన్‌లో జరగనున్న 20వ ఆసియా క్రీడల్లో దేశానికి స్వర్ణ పతకం అందించడంపై కన్నేసింది. ఇటీవల గాయాల బారిన పడినా, పట్టుదలతో వాటిని అధిగమించి ఫిట్‌నెస్ సాధించింది. ఏషియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు ముమ్మర సాధన చేస్తోంది.
జిల్లా సంఘం ఆకాంక్ష
జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు ఎర్రాజీ జ్యోతి ఎంపిక కావడంపై జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, ఇతర ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె స్వర్ణ పతకం సాధించి దేశానికి ఖ్యాతి తెస్తుందని ఆకాంక్షించారు.