జడ్పీ ఎన్నికలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:28 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టే. ఇప్పటికే జిల్లాలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.
నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
జిల్లాలో 11 జడ్పీటీసీలు, 172 ఎంపీటీసీ స్థానాలు, 616 పోలింగ్ కేంద్రాలు
21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న అభ్యర్థుల ప్రకటన
నవంబరు 3న ఎన్నికలు, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
జిల్లా వ్యాప్తంగా 4,98,467 మంది ఓటర్లు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టే. ఇప్పటికే జిల్లాలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి వంటివి ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ టి.నిషాంతి స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. అధికారులకు ఎన్నికల నిర్వహణ, తదితర విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను పక్కాగా అమలు చేసి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత నుంచి అధికార యంత్రాంగం మరింత జోరుగా తమ పనుల్లో నిమగ్నమవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కేంద్రం పాడేరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ, తదితర ప్రక్రియలు చేపడతారు. అందుకు గాను మండలానికి ఒకరు చొప్పున జిల్లాస్థాయి అధికారిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సైతం మండలాలకు ఇప్పటికే తరలించారు. అలాగే జిల్లాలో 616 పోలింగ్ కేంద్రాలకు గాను 1,300 బ్యాలెట్ బాక్సులను, సుమారుగా 5,000 మంది సిబ్బందిని సిద్ధం చేశారు.
జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలున్నాయి. మొత్తం 11 మండలాలు కాగా, మండలానికి ఒకటి చొప్పున మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలు, వాటి పరిధిలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలుండగా, ఆయా స్థానాల్లో 616 పోలింగ్ కేంద్రాలున్నాయి. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలను పరిశీలిస్తే అనంతగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, అరకులోయలో 16, చింతపల్లిలో 20, డుంబ్రిగుడలో 14, జి.మాడుగులలో 15, జీకేవీధిలో 18, హుకుంపేటలో 15, కొయ్యూరులో 14, ముంచంగిపుట్టులో 14, పాడేరులో 17, పెదబయలు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
జిల్లాలో 4,98,467 మంది ఓటర్లు
జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 612 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం 4,98,467 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఇలా...
- ఈ నెల 21 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
- 24న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
- 25న నామినేషన్లలో తప్పులను సరి చేసుకునేందుకు అప్పిల్కు అవకాశం
- 26న అభ్యర్థుల నామినేషన్ పత్రాల తిరస్కరణ
- 27న నామినేషన్ పత్రాల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన
- నవంబరు 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- 4న అవసరాన్ని బట్టి రీపోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
- 5న ఓట్ల లెక్కింపు, అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఫలితాల వెల్లడి .