నిలకడగా నీటిమట్టాలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:07 AM
సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరద నీటి ఉధృతి తగ్గింది. జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.
గరిష్ఠ స్థాయికి జలాశయాలు
సీలేరు, డొంకరాయిల నుంచి నీటి విడుదల నిలిపివేత
తగ్గుముఖం పట్టిన ఇన్‌ఫ్లో
బలిమెల జలాశయంలో ఏపీ వాటాగా 57.1693 టీంఎసీలు,
గుంటవాడ, డొంకరాయిల్లో 14.7448 టీఎంసీలు
సీలేరు కాంప్లెక్సుకు తప్పిన నీటి గండం
సీలేరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరద నీటి ఉధృతి తగ్గింది. జలాశయాలకు ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. శనివారం ఉదయం నుంచి సీలేరు (గుంటవాడ), డొంకరాయి జలాశయాల నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్టు జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. గుంటవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,360 అడుగుల కాగా, శనివారం ఉదయం 10.45 సమయానికి 1,357.20 అడుగుల వద్ద నిలకడగా ఉండడంతో ఈఈ అప్పలనాయుడు నీటి విడుదలను నిలిపివేశారు. అలాగే డొంకరాయి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,037 అడుగులు కాగా 1,032.50 అడుగులకు చేరడంతో నీటి విడుదలను ఆపేశారు. ప్రస్తుతం డొంకరాయికి 30,972 క్యూసెక్కులు, గుంటవాడకు 8,063 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్ కేంద్రాలకు ప్రధాన జలాశయంమైన బలిమెల జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,516 అడుగులు కాగా, శనివారం (26వ తేదీ) నాటికి 1,497.80 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం బలిమెలలో 62.3100 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. బలిమెల జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరాలంటే మరో 18.20 అడుగులు పెరగాల్సి ఉంది. ప్రస్తుతం బలిమెల జలాశయానికి 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
జోలాపుట్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం (26వ తేదీ) నాటికి 2745.65 అడుగులకు చేరింది. మరో 4.35 అడుగుల నీటిమట్టం పెరిగితే జోలాపుట్ జలాశయం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం జోలాపుట్‌కు 22,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. జోలాపుట్‌లో 27.7690 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.
ప్రస్తుతం జోలాపుట్, బలిమెల జలాశయాల్లో 90.0790 టీఎంసీలు నీటి నిల్వలు ఉండగా.. ఇందులో ఏపీ వాటా 57.1693 టీఎంసీలు, ఒడిశా వాటా 24.2596 టీఎంసీలు. అలాగే గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో ఉన్న 14.7448 టీఎంసీల నీటి నిల్వలతోపాటు బలిమెలలో ఆంధ్రా వాటాగా ఉన్న 57.1693 టీఎంసీల కలసి సీలేరు కాంప్లెక్సుకు ప్రస్తుతం 71.9141 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబరు 15వ తేదీ వరకు వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటి సంక్షోభవం తప్పదని జెన్‌కో ఇంజనీర్లు భావించారు. ఈ తరుణంలో తీవ్ర వాయుగుండం పుణ్యమా అని సీలేరు కాంప్లెక్సులోని జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ఠ సాయికి చేరుకున్నాయి.
సీలేరులో ఎంబాక్‌మెంట్ నుంచి వృథాగా పోతున్న నీరు
జలవిద్యుత్ కేంద్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్ డ్యాం వద్ద కొన్ని గేట్లు పూర్తిగా కిందకు దిగకపోవడంతో గేట్లు నుంచి అధికం లీక్ అవుతుంది. డిమాండ్ లేని కారణంగా లోడ్ డిశ్పాచ్ అధికారులు సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు చేయకపోవడంతో రెగ్యులేటర్ డ్యాం నుంచి లీక్ అవుతున్న నీరంతా చింతపల్లి క్యాంప్ వద్ద గల ఎంబాక్‌మెంట్ పైనుంచి గత రెండు రోజుల వృథాగా పోతోంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరిగితే ఎంబాక్‌మెంట్ నుంచి నీరు వృథాగా పోయే పరిస్థితి ఉండదని అంటున్నారు.
సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలు, ప్రస్తుతం నీటి నిల్వలు.
జలాశయం గరిష్ఠ నీటి ప్రస్తుతం నీటినిల్వలు
పేరు మట్టం(అడుగుల్లో) (అడుగుల్లో)
------------------------------------------------------------------------
1 జోలాపుట్ 2750 2745.65
2 బలిమెల 1516 1497.80
3 గుంటవాడ 1360 1357.20
4 డొంకరాయి 1037 1032.50
-----------------------------------------------------------------------