రెండు దశాబ్దాల తర్వాత ఎస్టీ జనరల్
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:24 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ సందడి మొదలైంది. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల కారణంగా మహిళలకే పరిమితమైన మండల పరిషత్ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) పదవులు ఈసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి.
ముంచంగిపుట్టులో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు కేటాయింపు
ఆశావహుల్లో చిగురించిన ఆశలు
టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు
ముంచంగిపుట్టు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ సందడి మొదలైంది. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల కారణంగా మహిళలకే పరిమితమైన మండల పరిషత్ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) పదవులు ఈసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎంపీపీ పీఠంపై పురుషులు కూర్చునేందుకు అవకాశం ఏర్పడడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు టిక్కెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలను పరిశీలిస్తే.. 2001, 2006లో ఎంపీపీగా కాసులమ్మ (కాంగ్రెస్), 2014లో వెచ్చంగి పద్మ(వైసీపీ), 2021లో అరిసెల సీతమ్మ(వైసీపీ) ఎంపీపీ పీఠాన్ని అధిరోహించారు. ఈసారి ఎన్నికల రిజర్వేషన్లలో ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో పురుష అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తామని పార్టీ పెద్దలకు భరోసా ఇస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జడ్పీటీసీ స్థానంపైనా ఆశలు
ముంచంగిపుట్టు జడ్పీటీసీ స్థానం సైతం ఈసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. గత రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల కారణంగా మహిళలే ప్రాతినిథ్యం వహించారు. 2001లో రొబ్బా ఈశ్వరమ్మ(బీఎస్పీ), 2006లో వెచ్చంగి పద్మ (కాంగ్రెస్), 2014లో కూడా కాసులమ్మ (వైసీపీ), 2021లో జల్లిపల్లి సుభద్ర(వైసీపీ) ఎన్నికై ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వహించారు. 2024లో గెలుపొందిన జల్లిపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అలాగే గతంలో వెచ్చంగి పద్మ సైతం జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈసారి జడ్పీటీసీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆసక్తికర చర్చలు
మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఈసారి ఎన్నికల బరిలో ఎవరెవరు నిలుస్తారనే అంశంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మహిళల ప్రాతినిఽథ్యం కొనసాగడంతో పెద్దగా ప్రభావం ఉండేది కాదు. అయితే ఈసారి పురుషులకు పోటీ చేసే అవకాశం కలగడంతో గ్రామగ్రామాన చర్చలు ఊపందుకున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో ఎంపీపీ , జడ్పీటీసీ పీఠీలు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.