జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా శ్రీనివాస్
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:06 AM
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు రిజిస్ట్రార్‌గా కిన్నంశెట్టి రాజుకు పదోన్నతి
విశాఖపట్నం లీగల్, ఆగస్టు 12 (ఆంధ్ర జ్యోతి):
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తు త జిల్లా జడ్జి కిన్నంశెట్టి రాజుకు పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా శ్రీనివాస్ ఈనెల 19వ తేదీలోగా విశాఖలో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడాలి
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి
పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నే పథ్యంలో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరుపై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన అంశాలను సీఎం ప్రస్తావించారు. పోలీసింగ్‌కు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టడంతోపాటు సాధించిన ప్రగతి, చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా డిజిటలైజేషన్ చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ఇబ్బంది కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికోసం చట్టసవరణ చేయాల్సి ఉన్నందని సీఎం అభిప్రాయపడ్డారు. విశాఖ నగరానికి భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి సంస్థలు తరలివస్తుండడం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతుంది కాబట్టి నిర్వహణను అందుకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉందని సీపీకి సూచించారు. ఇటీవల విశాఖలో జరిగిన ఒక వేడుక సందర్భంగా మూడు గంటలు పాటు ట్రాఫిక్ జామ్ జరిగి అంబులెన్స్‌లు, వాహనచోదకులు రోడ్డుపై ఉండిపోవడం అసంతృప్తి కలిగించిందని సీఎం అన్నారు. కార్యక్రమాలు ఉన్నప్పుడు వాహనాల రాకపోకలకు ఇబ్బందిలేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని సూచించారు. పోలీసింగ్‌లో డాగ్ స్క్వాడ్ ప్రాధాన్యం పెరిగిందని, డ్రగ్స్, గంజాయి పట్టివేతలో విశేష ప్రతిభ చూపుతున్నాయన్నారు. కొత్తగా మరిన్ని డాగ్ స్క్వాడ్స్‌ను తీసుకొస్తామని సీఎం వివరించారు. సీపీ స్పందిస్తూ విశాఖలో డాగ్స్‌స్క్వాడ్స్‌తో అనేక గంజాయి, డ్రగ్స్ కేసులను ఛేదించామని సీఎంకు వివరించారు.
నేడు ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ రాక
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ గురువారం నగరానికి వస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయలుదేరి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా 9.10 గంటలకు రాడిసిన్‌బ్లూ హోటల్‌కు వెళతారు. 9.30 గంటలకు ప్రారంభంకానున్న ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్‌తోపాటు ఆయన పాల్గొంటారు. తిరిగి 2.45 గంటలకు బయలుదేరి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.
ఏయూలో బదిలీలలు
సీనియర్ అసిస్టెంట్ల బదిలీల్లో అధికారులు పక్షపాతంతో వ్యవహరించారనే ఆరోపణలు
అస్మదీయులను కదల్చలేదని ఆరోపణలు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన సీనియర్ అసిస్టెంట్ల బదిలీల్లో అధికారులు వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 105 మందిని బదిలీ చేశారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని పాలనా సంస్కరణల్లో భాగంగా ఇతర విభాగాలకు బదిలీ చేశామని, దీనివల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని అందరికీ వర్తింపజేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయులైన ఉద్యోగులను మాత్రం అధికారులు కదపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీసీ, రిజిస్ర్టార్ కార్యాలయాలతో పాటు సీడీసీ, ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు, మరికొన్ని కీలక విభాగాల్లో ఎంతోమంది ఐదేళ్లకుపైబడి పనిచేస్తున్నప్పటికీ మార్చలేదని, దీనికి కారణాలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే, కొందరు ఉద్యోగులు బదిలీ ఉత్తర్వులు వెలువడానికి ముందే తాము ఫలానా విభాగానికి వెళ్లబోతున్నామంటూ ప్రచారం చేసుకున్నారని, దీనిని బట్టి ఈ ప్రక్రియ ఎంత పారదర్శకంగా నిర్వహించారో అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. సుదీర్ఘకాలం నుంచి కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా ఉన్నతాధికారులు బదిలీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో 99.6 శాతం సీట్లు భర్తీ
తొలి విడతలోనే జిల్లాలోని ప్రముఖ కళాశాలల్లో 99 శాతం సీట్లు భర్తీ
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలి విడత సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలోని ప్రముఖ కాలేజీల్లో గల సీట్లన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. కొన్నింటిలో 95 నుంచి 99 శాతం, మరో ఆరేడు కాలేజీల్లో 60 నుంచి 70 శాతం మేర సీట్లు భర్తీ అయ్యాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 473 సీట్లు ఉండగా 471 సీట్లు (99.6 శాతం) భర్తీ అయ్యాయి. రెండు సీట్లు మాత్రమే మిగిలాయి. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (సెల్ఫ్ ఫైనాన్స్)లో 165 సీట్లు ఉండగా 164 సీట్లు (99.4 శాతం) భర్తీ కాగా, మరో సీటు మిగిలి ఉంది. ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ వుమెన్స్‌లో 396 సీట్లకుగాను 395 సీట్లు (99.7 శాతం) భర్తీ కాగా, మరో సీటు మిగిలింది. అదేవిధంగా విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. రఘు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2,256 సీట్లకుగాను 2,246 సీట్లు (99.6 శాతం), అనిల్ నీరుకొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1,320 సీట్లకుగాను 1,314 సీట్లు (99.5 శాతం) భర్తీ అయ్యాయి.