హార్బర్ ఏసీపీకి శ్రీకాకుళం బదిలీ
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:09 AM
హార్బర్ సబ్ డివిజన్ ఏసీపీగా సీహెచ్ వివేకానందను నియమిస్తూ డీపీజీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
బాధ్యతలు స్వీకరించిన రోజే ఉత్తర్వులు
విశాఖపట్నం,ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
హార్బర్ సబ్ డివిజన్ ఏసీపీగా సీహెచ్ వివేకానందను నియమిస్తూ డీపీజీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఉద యం బాధ్యతలు స్వీకరించారు. తిరిగి అదేరోజు రాత్రి వివేకానందను శ్రీకాకుళం డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఒక్కరోజులోనే ఏసీపీ బదిలీ కావడం తీవ్ర చర్చనీయాంశమయింది. కాగా హార్బర్ ఏసీపీగా విశాఖ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ టి.చిట్టిబాబును నియమించారు.
ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలు
రూ.70 వేలు జరిమానా
బాలికను కిడ్నాప్ చేసి, తల్లిని చేసిన కేసులో పోక్సో కోర్టు తీర్పు
విశాఖపట్నం/చోడవరం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
హైస్కూల్ విద్యార్థినిని ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసి, ఇద్దరు పిల్లలకు తల్లిని చేసిన ఉపాధ్యాయుడికి 20 సంవత్సరాల కఠినకారాగార శిక్షతో పాటు రూ.70 వేలు జరిమానా విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ముద్దాయి జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. బాధితురాలికి జరిగిన అన్యాయానికి పరిహారంగా రూ.70 వేలు చెల్లించాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం చలపతి పబ్లిక్ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను అదే స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొయ్యాన తిరుపతిరావు ప్రేమ పేరుతో వంచించి తీసుకుపోయాడు. దీనిపై బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమె ఆచూకీ కోసం పోలీస్ బృందాలు మన రాష్ట్రంతో పాటు, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర నగరాల్లో విస్తృతంగా గాలించాయి. అయినప్పటికీ ఆచూకీ కనిపెట్టలేకపోయాయి. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, డీజీపీలు ప్రత్యేకంగా దృష్టిసారించి బాలికను వెదికేందుకు ప్రత్యేకంగా డీఎస్‌పీ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా వారి ఆచూకీ కనుగొనలేకపోవడంతో అప్పట్లో ఒక సీఐను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఉపాధ్యాయుడు రాజస్థాన్‌లో ఉన్నట్టు 2021 డిసెంబరులో గుర్తించారు. నాడు సీఐగా ఉన్న ఇలియాస్ మహ్మద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ విభీషణరావుతో పాటు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన బృందం రాజస్థాన్ రాష్ట్రంలోని ఆళ్వారు ప్రాంతానికి వెళ్లి బాలికతో పాటు ఉన్న ఉపాధ్యాయుడు తిరుపతిరావును అరెస్టు చేసి తీసుకువచ్చింది. నిందితుడిని జైలుకు పంపించి బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటికి ఆ బాలిక ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈ కేసులో బాలికను మోసగించి లైంగికంగా వేధించి గర్భవతిని చేసినట్టు నేరం రుజువు కావడంతో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పు వెల్లడించారు. కేసులో కీలకపాత్ర పోషించిన అప్పటి సీఐ ఇలియాస్ మహ్మద్, అనకాపల్లి డీఎస్‌పీ సునీల్‌తో పాటు కేసును సమర్థంగా వాదించి నిందితుడికి శిక్షపడేలా చేసిన పీపీ బట్టి రాజశేఖర్‌ను జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా అభినందించారు.
ఆటోలో వచ్చి హత్యచేసి...
ఆరిలోవ మహిళ హత్య కేసు దర్యాప్తులో పురోగతి
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పది బృందాలు గాలింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
ఆరిలోవ దుర్గానగర్‌లో మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కొందరిని విచారించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఉదయం 10.15 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తే హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. దుర్గానగర్ సెక్టార్-3కు చెందిన కాపు లక్ష్మి(45)ని బుధవారం గుర్తుతెలియని వ్యక్తి గొంతునులిమి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు పోస్టుమార్టం తర్వాత హత్యగా మార్చారు. లక్ష్మి ఇంటికి బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఒక వ్యక్తి ఆటోలో వచ్చాడు. ఆటోను కొంతదూరంలో ఆపి టోపీ, మాస్క్ ధరించి ఇంట్లోకి వెళ్లాడు. మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో తిరిగి బయటకు వెళ్లిపోయాడు. లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకుని ఉంటారని, తెలిసినవారు పిలిస్తేనే తప్ప తీయరని ఆమె భర్త రమణ చెబుతున్నారు. దీంతో తెలిసిన వ్యక్తే వచ్చి ఉంటారని, అందుకే ఆమె తలుపు తీశారని పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మి చీటీలు నిర్వహిస్తుంటారు. ఆమె వద్ద చీటీలు కట్టే వ్యక్తే అదనుచూసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లక్ష్మి శరీరంపై నగలు, ఇంట్లో ఉంచిన రూ.ఐదు లక్షలు కనిపించడం లేదని రమణ చెబుతున్నారు. నిందితుడు ఆటోలో వచ్చి...తిరిగి ఆటోలోనే వెళ్లిపోయినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన తరువాత పోలీసులు గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.
ప్రైవేటుకు ఈ-బస్ స్టేషన్లు
స్థలాలు ఖాళీ చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ ఆదేశాలు
తొలివిడతలో విశాఖకు 100 బస్సులు
ద్వారకా బస్‌స్టేషన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్ల ప్రతిపాదిత స్థలాలు ప్రైవేటుపరం కానున్నాయి. రాష్ట్రంలోని 12 బస్ స్టేషన్‌లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి వాటి నిర్వాహణను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఈ-సేవా పథకం కింద రాష్ట్రానికి మంజూరయ్యే ఈ-బస్సుల్లో తొలివిడత వంద వరకూ విశాఖకు రానున్నాయి. ఈ బస్సులను సింహాచలం, గాజువాక డిపోలకు కేటాయించేందుకు విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకుగాను ముందుగానే సింహపురి లేఅవుట్‌లో ఎనిమిది ఎకరాలు, గాజువాక డిపో వెనుక ఉన్న సుమారు 3.5 ఎకరాల స్థలం సేకరించి సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ స్థలాలు వాటి ఆధీనంలోకి వెళ్లనున్నాయి. నిర్వహణ సంస్థలు ఆయా స్థలాల్లో బస్సుల పార్కింగ్, చార్జింగ్ స్టేషన్, గ్యారేజీ, టూల్స్ స్టోర్ రూమ్, విడిభాగాల స్టోర్, ఎలక్ట్రిక్ స్టేషన్ వంటివి ఏర్పాటు చేసుకోనున్నాయి. ఈ నెలాఖరు నుంచి వీటికి సంబంధించిన పనులు ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. అందువల్ల ఆ స్థలాలను ఖాళీ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ సంబంధిత ఆర్టీసీ జిల్లా అధికారులకు, రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీచేసింది.