Share News

కేజీహెచ్‌లో కీచులాటలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 01:03 AM

కేజీహెచ్‌లో కీలక అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి.

కేజీహెచ్‌లో కీచులాటలు

సూపరింటెండెంట్‌కు, ఇతర అధికారులకు మధ్య విభేదాలు

ఉన్నతాధికారికి సహాయ నిరాకరణ

ఉద్యోగుల మధ్య కూడా గొడవలు

తనిఖీల ఊసే లేదు

రోగులకు అందే వైద్య సేవలపై ప్రభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌లో కీలక అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. సూపరింటెండెంట్‌కు సీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోలు, డిప్యూటీ సూపరింటెండెంట్ల మధ్య దూరం పెరగడంతో ఆస్పత్రిలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రోగులకు అందించే సేవలపైనా ప్రభావం పడుతోంది.

తమ అధికారాలకు సూపరింటెండెంట్‌ కత్తెర వేశారంటూ అధికారులంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను నడుచుకుంటున్నట్టు సూపరింటెండెంట్‌ చెబుతున్నారు. దీనిపై సీఎస్‌ఆర్‌ఎంవో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కొన్ని కీలక బిల్లులకు సంబంధించి సంతకాలు చేసేందుకు ఆయన అంగీకరించడం లేదని చెబుతున్నారు. తాజాగా పాలనలో కీలకమైన మరో అధికారి (ఏడీ)కి ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో ఇన్‌చార్జి ఏడీగా బాధ్యతలను అప్పగించాల్సి ఉంది. అయితే, కేజీహెచ్‌ ఉన్నతాధికారి, ఆంధ్ర మెడికల్‌ కళాశాల ఉన్నతాధికారి ఆ బాధ్యతలు దక్కకుండా చేశారని ఆస్పత్రి ఏడీ అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మూడు రోజుల కిందట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పంచాయితీ జరిగింది. తనకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వకుండా అనర్హుడైన ఉద్యోగికి బాధ్యతలను అప్పగించడంపై సదరు ఏడీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే, మరికొన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

అంతర్గత బదిలీలపై అసంతృప్తి

పాలనా సౌలభ్యం కోసం అనేక విభాగాల్లో సిబ్బందిని కొన్నాళ్ల కిందట మార్చారు. అయితే, తమను పక్కనపెట్టి జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించడంపై పలువురు సీనియర్‌ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిని మాత్రం అధికారులు సమర్థించుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి పాతుకుపోయిన వారిని మార్చడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులను పరిష్కరించినట్టు చెబుతున్నారు.

ఆస్పత్రిలో తనిఖీల ఊసేది

ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు, సీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోలు నిరంతరం వార్డులు, విభాగాల్లో తనిఖీలు చేస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి. అయితే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎప్పుడో తప్ప ఆకస్మిక తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే, ఇతర అధికారులు కూడా తనిఖీలకు వెళ్లడం లేదంటున్నారు. దీంతో అనేక విభాగాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో నెలకొన్న అంతర్గత విభేదాలపై జిల్లా కలెక్టర్‌ దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 28 , 2026 | 01:03 AM