Share News

అంకురించిన కేంద్రం

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:14 AM

మండలంలోని గంధవరంలో జిల్లా స్థాయి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో శిలాఫలకానికే పరిమితం కాగా, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు మొదలయ్యాయి.

అంకురించిన కేంద్రం
చోడవరం మండలం గంధవరంలో నిర్మాణం పూర్తయిన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం

గంధవరంలో పూర్తయిన విత్తన శుద్ధి కేంద్రం, గిడ్డంగి

వచ్చే నెలలో ప్రాంభానికి సన్నాహాలు

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతులకు విత్తనాలు సరఫరా

గత టీడీపీ హయాంలోనే మంజూరు

ఐదేళ్లపాటు పట్టించుకోని వైసీపీ పాలకులు

మళ్లీ కూటమి పాలనలోనే మోక్షం

చోడవరం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంధవరంలో జిల్లా స్థాయి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో శిలాఫలకానికే పరిమితం కాగా, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు మొదలయ్యాయి. ఏడాదిన్నర కాలంలోనే చేయడం విశేషం. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం పనులు పూర్తికావడంతో రెండు, మూడు రోజుల్లో జిల్లా విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించనున్నారు. వచ్చే నెల రెండు లేదా మూడవవారంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా విత్తన గిడ్డంగి లేదు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలు విజయనగరం జిల్లాలోని గోదాము నుంచి సరఫరా అవుతుంటాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతులకు వివిధ పంటల సాగుకు మేలైన విత్తనాలను అందజేయడానికి జిల్లాలోనే విత్తన గిడ్డంగి ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు 2018లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అవసరమైన ఐదు ఎకరాల భూమిని మండలంలోని గంధవరంలో గుర్తించారు. స్థల సేకరణ పూర్తయ్యే సమయానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాది వరకు విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం గురించి వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. 2020 జూలై 9వ తేదీన అప్పటి మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శంకుస్థాపన చేశారు. 40 వేల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యం కలిగిన వీటి నిర్మాణ పనులను ఏడాదిలో పూర్తిచేసి, రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించగా టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకొన్నారు. అయితే స్థలంలో వున్న రాతి గుట్టలను తొలగిస్తేనే పనులు చేపడతామని కాంట్రాక్టర్‌ స్పష్టం చేశారు. గనుల శాఖ అనుమతితో రాళ్లను పగలగొట్టి, స్థలాన్ని అప్పగించడానికి రెండేళ్లు పట్టింది. పునాదులస్థాయి వరకు పనులు పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌ బిల్లు అప్‌లోడ్‌ చేశారు. నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో 2023 ఏప్రిల్‌లో పనులు ఆపేశారు. నాడు మంత్రులుగా వున్న బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌ పట్టించుకోకపోవడంతో వైసీపీ అధికారంలో నుంచి దిగిపోయే వరకు పునాదులకే పరిమితం అయ్యింది. ఏడాదిన్నర క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పునఃప్రారంభం అయ్యాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఆదేశాలతో కాంట్రాక్టర్‌ వేగంగా పనులు పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో విత్తనాభివృద్ధి సంస్థ అధికారులకు అప్పగిస్తారు. వచ్చే నెలలో శుభముహూర్తం చూసుకొని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిసింది.

ఖరీఫ్‌ నుంచే రైతులకు విత్తనాలు సరఫరా

కేపీ నాగసాయిబాబు, జిల్లా మేనేజర్‌, ఏపీఎస్‌డీసీ

గంధవరంలో విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు అప్పగించాల్సి వుంది. దీనిని ప్రారంభించిన తరువాత విత్తన శుద్ధి, నిల్వ పనులు చేపడతాం. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉమ్మడి జిల్లా రైతులకు ఇక్కడి నుంచే విత్తనాలు సరఫరా అవుతాయి.

Updated Date - Feb 25 , 2026 | 01:14 AM