జ్వరాల వ్యాప్తి
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:01 AM
నగరంలో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఫ్లూ వైరస్ చురుకుగా మారడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు, గొంతు నొప్పితో మొదలు
తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు...
ఆస్పత్రులకు భారీగా బాధితులు
డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా కేసులు కూడా నమోదు
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
నగరంలో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఫ్లూ వైరస్ చురుకుగా మారడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ వైరస్ సోకిన వారిలో తొలుత జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి రెండు నుంచి నాలుగు రోజులపాటు వేఽధించిన తరువాత తీవ్రమైన ఒళ్లు నొప్పులతో కూడిన జ్వరం ప్రారంభమవుతోందని పేర్కొంటున్నారు. జ్వరం మూడు రోజుల నుంచి వారంపాటు ఉంటోందని, మందులు వాడిన తరువాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వరం తగ్గిన తరువాత కూడా ఎక్కువ మందిలో ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, జలుబు రెండు నుంచి మూడు వారాలు కొనసాగుతున్నాయంటున్నారు. అయితే ఈ లక్షణాలతో వచ్చే ప్రతి ముగ్గురిలో ఒకరికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతోందని, కొద్దిమందిలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా నిర్ధారణ అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. జ్వరాలతో కేజీహెచ్‌తోపాటు విమ్స్‌కు అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. గడిచిన రెండు వారాల నుంచి ప్రతిరోజూ కేజీహెచ్‌కు 150 మంది, విమ్స్‌కు 100 మందికిపైగా వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తగ్గని ఇన్ఫెక్షన్లు
సాధారణంగా వైరల్ ఫీవర్స్‌తో ఆస్పత్రులకు వచ్చే వారికి యాంటీ బయాటిక్స్‌తో కూడిన మందులు అందిస్తుంటారు. అయితే, జ్వరం తగ్గినప్పటికీ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఎక్కువ మందికి మందులు మార్చాల్సిన అవసరం ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొందరికి కల్చర్ (రక్తం, మూత్రం, కఫం మొదలైనవి) పరీక్షలు నిర్వహించి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు డాక్టర్ జ్ఞానసుందరరాజు తెలిపారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పట్టేంత వరకు రోగులు తీవ్రమైన అలసట, నీరసంతో ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివారు విశ్రాంతి తీసుకోవడంతోపాటు ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలని చెబుతున్నట్టు సూచించారు.
పిల్లలపై ప్రభావం
ఫ్లూ వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోంది. మూడు రోజులకు మించి దగ్గు, జలుబు ఉన్నట్టయితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మూడు రోజులకు మించి జ్వర లక్షణాలు ఉంటే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమయాజులు తెలిపారు. సీజన్ మారడంతోపాటు అడపాదడపా కురుస్తున్న వర్షాల ప్రభావంతోనే వైరస్ వ్యాప్తి చెంది వ్యాధులు బారినపడేలా చేస్తున్నదన్నారు.
డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారుల పర్యటన
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
డెంగ్యూ కేసులు నమోదైన భీమ్‌నగర్, అల్లిపురం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జిల్లా మలేరియా అధికారి వరప్రసాద్‌రెడ్డి, సహాయ అధికారి బి.నాగభూషణరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. వ్యాధి నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. డెంగ్యూ కేసులు నమోదైన ఇళ్ల చుట్టుపక్కల నివాసాల్లో ఫీవర్ సర్వే నిర్వహించారు. కీటక జనిత వ్యాధులు నుంచి రక్షణకు, దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లు పెట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక ఏఎన్‌ఎం, ఆశ, జీవీఎంసీ సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు మురళీ, గణేష్, ఇతర ఇబ్బంది పాల్గొన్నారు.