Share News

తూతూమంత్రంగా క్రీడా శిబిరాలు

ABN , Publish Date - May 12 , 2026 | 01:32 AM

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటు విషయంలో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తూతూమంత్రంగా క్రీడా శిబిరాలు

కేవలం పది రోజులు మాత్రమే నిర్వహించాలని జీవీఎంసీ నిర్ణయం

రూ.90 లక్షలకుపైగా వ్యయం

పది రోజుల్లో పిల్లలు ఏం నేర్చుకుంటారంటూ తల్లిదండ్రుల పెదవివిరుపు

కనీసం మూడు వారాలైనా ఏర్పాటుచేయాలని డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటు విషయంలో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏటా వేసవి సెలవుల్లో శిబిరాలను ఏర్పాటుచేస్తుంటారు. కనీసం నెల రోజులపాటు విద్యార్థులకు తర్ఫీదు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం కేవలం పది రోజులు మాత్రమే శిక్షణ శిబిరాలు నిర్వహించనుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవివిరుస్తున్నారు.

జీవీఎంసీ ఏటా వేసవి సెలవుల్లో కనీసం నెల రోజులపాటు క్రీడా శిబిరాలను నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. శిబిరాలకు హాజరయ్యే విద్యార్థులకు టీషర్టులు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది వేసవి సెలవులు ప్రకటించి మూడు వారాలు గడిచిపోయినా ఇంతవరకూ అధికారులు క్రీడా శిబిరాల నిర్వహణ గురించి పట్టించుకోలేదు. దాంతో ఈ ఏడాది శిబిరాలు లేనట్టేనని అంతా భావించారు. కానీ ఏమైందోగానీ ఈనెల 25 నుంచి పదిరోజులపాటు వేసవి శిబిరాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రూ.90 లక్షల వ్యయంతో 46 క్రీడాంశాల్లో జీవీఎంసీ పరిధిలోని 486 చోట్ల ఈ శిబిరాలను నిర్వహించేలా షెడ్యూల్‌ను తయారుచేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆహారం సరఫరా, క్రీడా సామగ్రి కొనుగోలుకు టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉండదు కాబట్టి, అస్మదీయులైన కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఒక ప్రజా ప్రతినిధి ఒత్తిడితోనే?

ఈ ఏడాది వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించకూడదనే అభిప్రాయంతో ఉన్న జీవీఎంసీ అధికారులపై నగరానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధి ఒత్తిడి తీసుకువచ్చి మరీ కనీసం పది రోజులైనా ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. పది రోజుల శిక్షణ వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ఒకరోజు ప్రారంభ వేడుక, చివరిరోజు ముగింపు వేడుకకు తీసేస్తే మిగిలిన ఎనిమిది రోజుల్లో ఏం నేర్చుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేవలం అస్మదీయులైన కోచ్‌లు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ క్రీడా శిబిరాల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 21 రోజులైనా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - May 12 , 2026 | 01:32 AM