Share News

జనగణన ప్రక్రియ వేగవంతం

ABN , Publish Date - May 27 , 2026 | 12:01 AM

జిల్లాలో జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.

జనగణన ప్రక్రియ వేగవంతం
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

- అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

- భూముల మ్యుటేషన్లను ప్రణాళికాబద్ధంగా చేయాలని సూచన

పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలపై ఆ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ జనగణన ప్రక్రియలో చేర్చాలని, ఓటరు జాబితాల్లో చేర్పులు, మార్పులపై బూత్‌ స్థాయి అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రంతో మ్యాపింగ్‌ చేయాలని, భూముల రీసర్వే ప్రక్రియలను ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు. అన్ని మండలాల్లో జరిగిన రీసర్వే వివరాలను తొలుత సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి పంపించి రికార్డుల పరిశీలన జరగాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలని, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎంల స్పందన ప్రక్రియలో నాణ్యత, సంతృప్తి శాతాన్ని పెంచాలన్నారు. 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన జాబితాల సవరణలుంటే ప్రణాళికాబద్ధం వాటిని సమన్వయంతో సరి చేయాలని సూచించారు. జిల్లాలో భూముల మ్యుటేషన్‌ ప్రక్రియ పక్కాగా జరగాలని, ఎటువంటి లోటుపాట్లు జరగకూడదన్నారు. జనన, మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం లేకుండా సకాలంలో జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన తహశీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:01 AM