Share News

ప్రాణం తీసిన అతివేగం

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:08 AM

అతి వేగం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని సమీపంలోని కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ప్రాణం తీసిన అతివేగం
ఈర్ల అనిల్‌ కుమార్‌ (ఫైల్‌ఫొటో)

చెట్టును ఢీకొన్న కారు

ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

పరవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అతి వేగం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని సమీపంలోని కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ నగరంలోని వడ్లపూడి ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన ఈర్ల అనిల్‌కుమార్‌ (30), జీవీఎంసీ 77వ వార్డు పరిధి అప్పికొండ సమీపంలోని శ్రీరామనగర్‌కు చెందిన కూండ్రపు పవన్‌కుమార్‌, ఈర్ల సతీశ్‌, ధర్మిరెడ్డి మధు కలిసి గురువారం రాత్రి కారులో బయలుదేరి పరవాడ మండలం కలపాక, మరిశవానిపాలెంలో జరిగిన దుర్గాదేవి ఉత్సవాలకు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి బయలుదేరారు. సుమారు కిలోమీటరు దూరం వెళ్లేసరికి కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని, పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు కుడివైపు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న ఈర్ల అనిల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్‌, సతీశ్‌, మధు గాయాలతో బయటపడ్డారు. కారును అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ఉత్సవానికి హాజరై తిరిగి వెళుతున్నవారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంల మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందిన అనిల్‌కుమార్‌ పెదగంట్యాడ సమీపంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 31వ తేదీన అప్పికొండ సమీపంలోని శ్రీరామనగర్‌కు చెందిన యువతితో వివాహమైంది. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 01:08 AM