ట్రాఫిక్ ఉల్లంఘనులపై స్పీడ్ లేజర్‌గన్
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:28 AM
నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యతోపాటు నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించినా, అనివార్య కారణాలతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. దానికి ప్రత్యామ్నాయంగా స్పీడ్ లేజర్‌గన్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ ఒకటి నుంచి వాటిని పది చోట్ల ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనకు బ్రేక్
ప్రత్యామ్నాయంగా స్పీడ్ లేజర్‌గన్
ఏప్రిల్ ఒకటి నుంచి పదిచోట్ల ఏర్పాటుచేయాలని సీపీ నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యతోపాటు నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించినా, అనివార్య కారణాలతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. దానికి ప్రత్యామ్నాయంగా స్పీడ్ లేజర్‌గన్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ ఒకటి నుంచి వాటిని పది చోట్ల ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు.
నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 400 మంది మృత్యువాతపడుతున్నారు. మరో 1,200 మంది క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా ట్రాఫిక్ సమస్య కూడా జటిలమవుతోంది. కొన్ని ప్రధాన కూడళ్లలో సిగ్నల్ దాటడానికి కనీసం 15 నిమిషాలు నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళ అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. దీంతో వాహన చోదకులు కొందరు అంతసేపు వేచివుండలేక సిగ్నల్స్ జంపింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతోంది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం అయిన డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీపీ భావించారు. జీవీఎంసీ సహకారంతో నగరంలో సుమారు 83 కూడళ్లలో ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. దీనివల్ల ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే ఆటోమేటిక్‌గా ఫొటో తీసి వాహన యజమానికి ఈ-చలాన్ జారీ అయిపోతుంది. దీనివల్ల ట్రాఫిక్ పోలీసులను ఇతర విధులకు ఉపయోగించేందుకు అవకాశం ఉంటుంది.
దీంతోపాటు నగరంలో లేదా ఇతర ప్రాంతాల్లో హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, కిడ్నాప్‌లు వంటి నేరాలకు పాల్పడిన వారెవరైనా పోలీసులు కళ్లుగప్పి తిరుగుతూ రోడ్డుపైకి వస్తే సీసీ కెమెరాలకు అమర్చిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ వెంటనే గుర్తించి పోలీస్ కంట్రోల్ రూమ్‌తోపాటు సమీపంలోని పోలీసులకు వారి వివరాలను చేరవేస్తుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ సహకారంతో ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమకూర్చుకోవాలని సీపీ భావించారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ పూర్తవ్వడంతో ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీని పిలిచారు. ఏప్రిల్ ఒకటి నుంచి నగరంలో దీనిని అందుబాటులోకి తెస్తామని సీపీ ప్రకటించారు. కానీ ఏమైందోగానీ ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు బదులుగా లేజర్ స్పీడ్ గన్‌లను వివిధ సంస్థల సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేయాలని సీపీ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు. ముందుగా నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న పదిచోట్ల వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వాహనాల వేగపరిమితి, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్‌డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిని దూరం నుంచే గుర్తించే వాహనం ఫొటోలను తీసి పోలీస్ కమాండ్ కంట్రోల్‌సెంటర్‌కు చేరవేస్తుంది. అక్కడి నుంచి ట్రాఫిక్ చలాన్‌లను వాహన నంబర్ ఆధారంగా వాహనం యజమానికి పంపిస్తారు. వీటిని కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అందుబాటులోకి తేవాలని సీపీ కార్యాచరణ సిద్ధం చేసినట్టు ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెబుతున్నారు.