Share News

మారుమూల పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:38 PM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

మారుమూల పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద రాత్రి సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నాని

పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు

మండల కేంద్రంలో పోలీస్‌ చెక్‌పోస్టు ఏర్పాటు

ఎన్నికల నేపథ్యంలో బైండోవర్‌ కేసులు

ఏడు కేంద్రాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగింపు

ముంచంగిపుట్టు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ఏడు కేంద్రాల్లో సమయం కుదింపు

మండలంలో 23 పంచాయతీల పరిధిలో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లకు 45 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో గత ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు, పోలింగ్‌ కేంద్రాలకు చేరకోవడంలో ఎదరవుతున్న ఇబ్బందులు, సుదూర ప్రయాణాలు, పరిమిత రవాణా సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాల ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు, కుమడ, వనుగుమ్మ, బాబుసాలలో గల ఏడు పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ సమయాన్ని కుదించింది. ఆయా కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సిన పోలింగ్‌ను మధ్యాహ్నం 3 గంటలు వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అడుగడుగునా పోలీసుల నిఘా

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎస్పీ అమిత్‌ బర్దార్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పోలీసు బలగాలను మోహరించడంతోపాటు అనుమానాస్పద కదలికలపై నిఘా పెడుతున్నారు. ప్రధాన రహదారులు, మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ.. అవసరమైన చోట్ల గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌ల వద్ద పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేశారు.

మండల కేంద్రంలో చెక్‌పోస్టు ఏర్పాటు

మండల కేంద్రంలో పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటుచేశారు. ఇక్కడ 24 గంటలూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల తరలింపు జరగకుండా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సుమారు 300 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాలు, దూరప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది సకాలంలో చేరుకోవడం, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం కూడా కీలకంగా మారింది. పోలింగ్‌ సామగ్రి తరలింపు, సిబ్బంది భద్రత, ఓటర్ల రాకపోకలు వంటి అంశాలపై అధికారులు సమన్వయంతో వ్యవహిరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద పరిస్థితులకు అనుగుణంగా భద్రత చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Updated Date - Oct 24 , 2026 | 11:38 PM