పంచాయతీల్లో ప్రత్యేక పాలన
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:08 AM
గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలుపొంది, పదవీ బాధ్యతలు చేపట్టిన పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం గురువారంతో ముగిసింది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు మండల స్థాయిలో గజిటెడ్ అధికారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించడంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తయిన పాలకవర్గాల పదవీ కాలం
జిల్లాలో 244 పంచాయతీలకు 81 మంది ప్రత్యేక అధికారుల నియామకం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలుపొంది, పదవీ బాధ్యతలు చేపట్టిన పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం గురువారంతో ముగిసింది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు మండల స్థాయిలో గజిటెడ్ అధికారులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించడంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులున్నాయి. పురుషు ఓటర్లు 2 లక్షల 19 వేల 896 మంది, మహిళా ఓటర్లు 2 లక్షల 30 వేల 147 మంది, ఇతరులు 18 మంది మొత్తం 4 లక్షల 50 వేల 61 మంది ఓటర్లున్నారు. పంచాయతీలను పునర్విభజనచేసి, కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో జిల్లాలో పంచాయతీలు, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రత్యేకాధికారుల నియామకం
గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఐదేళ్లు పూర్తికావడంతో పంచాయతీలకు మండల స్థాయిలో ఉన్న గజిటెడ్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి శిశిభూషణ్‌కుమార్ ఈనెల 11న జీవో జారీ చేశారు. ఈ మేరకు తహశీల్లార్లు, మండల విద్యా శాఖాధికారులు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, సీడీపీవోలు, తదితరులను పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్ని మండలాల్లో గజిటెడ్ ర్యాంకు వున్న అధికారులను గుర్తించారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ 81 మందిని ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది.
మండలాల వారీగా పంచాయతీలు, ప్రత్యేకాధికారులు..
మండలం పంచాయతీలు ప్రత్యేకాధికారులు
అరకులోయ 14 7
అనంతగిరి 24 7
డుంబ్రిగుడ 18 6
హుకుంపేట 33 7
పెదబయలు 23 7
ముంచంగిపుట్టు 23 7
పాడేరు 26 11
జి.మాడుగుల 17 8
చింతపల్లి 17 8
జీకేవీధి 16 6
కొయ్యూరు 33 7
మొత్తం 244 81