జి.భీమవరం పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:31 AM
జిల్లాలోని కశింకోట మండలం జి.భీమవరం పంచాయతీకి ఐఎస్‌వో(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) గుర్తింపు లభించింది. పాలనలో పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన సేవలు, మెరుగైన రికార్డుల నిర్వహణకు గాను గ్రామ పంచాయతీకి ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్ లభించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తిపన్ను వసూళ్ల రికార్డులు, తీర్మానాల పుస్తకం, నగదు పుస్తకం, ఆడిట్ నివేదికలు పక్కాగా చేపడుతున్నట్టు ఐఎస్‌వో సర్టిఫికెట్ జారీ బృందం గుర్తించింది.
- ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్ జారీ
- పాలనలో పారదర్శకత, నాణ్యమైన సేవలకు దక్కిన గౌరవం
నర్సీపట్నం/అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కశింకోట మండలం జి.భీమవరం పంచాయతీకి ఐఎస్‌వో(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) గుర్తింపు లభించింది. పాలనలో పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన సేవలు, మెరుగైన రికార్డుల నిర్వహణకు గాను గ్రామ పంచాయతీకి ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్ లభించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తిపన్ను వసూళ్ల రికార్డులు, తీర్మానాల పుస్తకం, నగదు పుస్తకం, ఆడిట్ నివేదికలు పక్కాగా చేపడుతున్నట్టు ఐఎస్‌వో సర్టిఫికెట్ జారీ బృందం గుర్తించింది. ఈ పంచాయతీలో సిటిజన్ చార్టర్‌లో ఏ సేవకు ఎంత సమయం పడుతుంతో స్పష్టంగా తెలియజేస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. కార్యాలయం వాతావరణం పరిశుభ్రత, వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన ప్రజల కోసం తాగునీరు, కూర్చోవడానికి బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించారు. ఫిర్యాదుల పెట్టె, సమాచారం హక్కు చట్టం(ఆర్‌టీఐ) వివరాలు అందుబాటులో ఉంచారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్టు ఐఎస్‌వో బృందం గుర్తించింది. ఐఎస్‌వో ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ పని తీరు ఉండడంతో మూడు సంవత్సరాల కాల పరిమితికి ఐఎస్‌వో 9001 సర్టిఫికెట్ జారీ చేశారు. అవే ప్రమాణాలు మూడేళ్లు పాటిస్తున్నారా?, లేదా? అని ప్రతీ సంవత్సరం వార్షిక తనిఖీ చేస్తారు. దీని వలన ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు లభిస్తాయి. పంచాయతీ పాలలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుంది. ఐఎస్‌వో సర్టిఫికెట్ పొందిన పంచాయతీకి మండల, జిల్లాస్థాయిలో ప్రత్యే గుర్తింపు ఉంటుందని డీపీవో సందీప్ తెలిపారు.