Share News

కౌమార బాలుర సాధికారతకు ప్రత్యేక ప్రాజెక్టు

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:15 AM

కౌమార బాలుర సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేకంగా పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని యునిసెఫ్‌ ఏపీ ప్రోగ్రాం అధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

కౌమార బాలుర సాధికారతకు ప్రత్యేక ప్రాజెక్టు
మాట్లాడుతున్న ఏపీ యూనిసెఫ్‌ పీవో సుబ్బారెడ్డి, వేదికపై కన్సల్టెంట్‌ నరసింహమూర్తి, సీడీపీవో శ్రీదేవి

యునిసెఫ్‌ ఏపీ పీవో సుబ్బారెడ్డి

చింతపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కౌమార బాలుర సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేకంగా పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని యునిసెఫ్‌ ఏపీ ప్రోగ్రాం అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం వెలుగు స్త్రీ శక్తి కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ పరిధి గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ, గురుకుల పాఠశాల నోడల్‌ ఉపాధ్యాయులకు శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ సహకారంతో యునిసెఫ్‌ ‘కౌమార బాలుర సాధికారత’పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా హాజరైన యునిసెఫ్‌ ఏపీ పీవో మాట్లాడుతూ కౌమార బాలురలో సానుకూల దృక్పథం, బాధ్యతాయుత ప్రవర్తన, లింగ సమానత్వం, మహిళలపై గౌరవం, జీవన నైపుణ్యాలు పెంపొందించడం, మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడేలా ప్రభుత్వం కౌమార బాలుర సాధికారతపై ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు జిల్లాలోని 81 గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఈ పైలట్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి ఒకరూ, ఇద్దరు చొప్పున 121 మంది ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో అరకు, పాడేరులో నోడల్‌ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో చింతపల్లిలో నిర్వహిస్తున్నామన్నారు. నోడల్‌ ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ కె.నరసింహ మూర్తి, జిల్లా జీసీడీవో ఎం.కవిత, సీడీపీవో సీహెచ్‌. శ్రీదేవి, ఎన్‌జీవో సీఈవో పడాల సూర్య ప్రసాద్‌, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు గురుకుల, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:15 AM