అరకు కాఫీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ABN , Publish Date - May 14 , 2026 | 12:48 AM
అరకు కాఫీ అభివృద్ధికి కేంద్ర కాఫీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని సీఈవో, కార్యదర్శి ఎం.కూర్మారావు అన్నారు.
వాణిజ్య సరళి ఉద్యాన అంతర పంటలపై అధ్యయనం
గిరిజనుల ప్రగతికి 50 ఏళ్లగా కేంద్ర కాఫీ పరిశోధన స్థానం కృషి
కేంద్ర కాఫీ బోర్డు సీఈవో, కార్యదర్శి ఎం.కూర్మారావు
గూడెంకొత్తవీధి, మే 13 (ఆంధ్రజ్యోతి): అరకు కాఫీ అభివృద్ధికి కేంద్ర కాఫీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని సీఈవో, కార్యదర్శి ఎం.కూర్మారావు అన్నారు. బుధవారం కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ డాక్టర్ ఎంజే దినేశ్‌తో కలిసి ఆయన ఆర్‌వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానాన్ని సందర్శించారు. పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న కాఫీ తోటలు, పరిశోధనలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూర్మారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో కాఫీ పంట ఆదివాసీల జీవితాల్లో పెను మార్పును తీసుకొచ్చిందన్నారు. ఆదివాసీ ప్రధాన వాణజ్య పంట స్థానాన్ని సొంతం చేసుకుని జీవనాధారంగా మారిందన్నారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపురావడం, స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాఫీ సాగుకు అందిస్తున్న సహాయ, సహకారాల వల్ల ఆదివాసీ రైతులు కాఫీ సాగులో ముందంజలో వున్నారన్నారు. ప్రపంచ దేశ కాఫీ ప్రియులు అరకు కాఫీ రుచులను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కాఫీ సాగుతో పాటు గిరిజన రైతుల ఆర్థిక ప్రగతికి వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు అనువైన ఉద్యాన పంటలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కాఫీ తోటల్లో గిరిజన రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారన్నారు. రైతులకు ప్రధాన పంట కాఫీతో పాటు మిరియాల పంట ద్వారా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కాఫీకి నీడనిచ్చేందుకు సిల్వర్ ఓక్ మొక్కలను పెంచుకుంటున్నారన్నారు. రైతులు నీడ కోసం ఉద్యాన పంటల మొక్కలను నాటుకోవడం వల్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. కాఫీ తోటల్లో ఆవకాడో తరహాలో పండ్ల మొక్కల సాగు చేసుకునేందుకు ఉద్యానశాఖ అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అరకులోయలో గురువారం ఆంధ్ర, ఒడిశా కాఫీ రైతులతో వర్కుషాపు ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజనులు కాఫీ సాగులో ప్రగతి సాధించేందుకు 50 ఏళ్లగా ఆర్‌వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం విశిష్ట కృషి చేస్తున్నదన్నారు. ఈ 50 ఏళ్లలో గిరిజన రైతులకు అరబికాలో 15, రొబస్ట్రాలో రెండు రకాల నాణ్యమైన విత్తనాలను అందజేసిందని చెప్పారు. పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, విస్తరణ విభాగం అధికారులు గిరిజన రైతులకు ఎప్పటికప్పుడు సాగులో మెలకువలు, నూతన యాజమాన్య పద్ధతులను పరిచయం చేస్తున్నారన్నారు. కేంద్ర కాఫీ బోర్డు ద్వారా రైతులకు ప్రత్యేక రాయితీలు అందజేస్తున్నామన్నారు. ఆర్‌వీనగర్ ప్రాంతీయ పరిశోధన స్థానం 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో నవంబరులో గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక చిక్‌మంగుళూరు సీసీఆర్‌ఐ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సెంతిల్ కుమార్, బెంగళూరు కేంద్ర కాఫీ బోర్డు జాయింట్ డైరెక్టర్ శివకుమార్ స్వామి, పాడేరు డీడీ హెచ్‌ఆర్ మురళీధర్, ఆర్‌వీనగర్ ఆర్‌సీఆర్‌ఎస్ ఇన్‌చార్జి డి. సునీల్‌బాబు, జేఎల్‌వో రవికుమార్, ఐటీడీఏ కాఫీ ఏడీ లకే బొంజుబాబు పాల్గొన్నారు.