Share News

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:44 AM

గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

రెండో తేదీతో ముగియనున్న పాలకవర్గాల పదవీ కాలం

స్పెషల్‌ ఆఫీసర్ల నియామకానికి కసరత్తు పూర్తి

మండలస్థాయి అధికారులకు బాధ్యతలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళతాయి. ఈ మేరకు ఆయా అధికారులతో జాబితాల తయారీలో జిల్లా ప్రభుత్వం యంత్రాంగం తలమునకలైనట్టు సమాచారం.

జిల్లాలో మొత్తం 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో (అప్పట్లో ఉమ్మడి జిల్లా) నాలుగు దశల్లో పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఏప్రిల్‌ రెండో తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ రెండో తేదీ) ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తికాలేదు. ఇంకా కుటుంబ సర్వే, బీసీ జనభాగణన, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణను కొద్ది నెలలపాటు వాయిదా వేసింది. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. గజిటెడ్‌ హోదా కలిగిన అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారులు మండలాల్లో పనిచేస్తున్న గజిటెడ్‌ హోదా కలిగిన తహశీల్దారు, ఎంపీడీఓ, ఇతర అధికారులతో జాబితాలను తయారు చేశారు. ఒకవేళ పంచాయతీలకు సరిపడ మండలస్థాయి అధికారులు లేనట్టయితే పంచాయతీస్థాయిలో సీనియర్‌ అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌ ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేసి, ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేస్తారని సమాచారం. పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకు, లేదా ఆరు నెలలపాటు (ఏది ముందు అయితే అది వర్తిస్తుంది) ప్రత్యేక అధికారుల పాలన వుంటుంది.

Updated Date - Mar 31 , 2026 | 01:44 AM