Share News

భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 10:45 PM

జిల్లాలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు.

భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిశాంతి, పక్కన జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశం

జలధార- జలహారతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

పాడేరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జలధార- జలహారతిపై వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా జలధార- జలహారతి వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. అందుకు గాను వివిధ శాఖల సమన్వయంతో నీటి నిల్వ కట్టడాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటికి 326 భూగర్భ జలాల సంరక్షణ కట్టడాలకు మాత్రమే స్థలాలను గుర్తించారని, మిగిలిన గ్రామాల్లో వాటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జల వనరుల శాఖ, అటవీ, చిన్న నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంగా క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టి, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే కార్యాచరణ ప్రణాళికతో పాటు గుర్తించిన గ్రామాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ కట్టడాలకు అవసరమైన డిజైన్‌లను రూపొందించాలన్నారు. భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే జలధార- జలహారతి వంద రోజుల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. శాఖల వారీగా రూపొందించిన ప్రణాళికలను తమకు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జలవనరుల శాఖ డీడీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, డివిజనల్‌ అటవీ అధికారి ఉమామహేశ్వరి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 10:45 PM