మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:47 AM
గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) ఎం.తులసి తెలిపారు. బుధవారం ఆర్వీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె మలేరియా పరీక్షల రికార్డులను పరిశీలించారు. సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దోమల మందు పిచికారీ చేసిన పనసబంద గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల యోగ క్షేమాలు, జ్వరాల పరిస్థితి, అందుతున్న చికిత్సపై ఆమె ఆరా తీశారు.
జ్వర బాధితులు సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి
- పసర మందులు, నాటు వైద్యానికి దూరంగా ఉండాలి
- పరీక్ష కిట్లు, మందుల కొరత లేదు
- జిల్లా మలేరియా అధికారి తులసి
చింతపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) ఎం.తులసి తెలిపారు. బుధవారం ఆర్వీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె మలేరియా పరీక్షల రికార్డులను పరిశీలించారు. సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దోమల మందు పిచికారీ చేసిన పనసబంద గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల యోగ క్షేమాలు, జ్వరాల పరిస్థితి, అందుతున్న చికిత్సపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంవో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మలేరియా అదుపులో వుందన్నారు. జ్వర బాధితులకు కచ్చితంగా రక్త పరీక్షలు చేస్తున్నామన్నారు. జ్వర బాధితులకు ఆర్డీటీ, స్లైడ్ ద్వారా మలేరియా పరీక్షలు నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించామన్నారు. ఈ ఏడాది ముందుగా వర్షాలు పడడం వల్ల గ్రామాల్లో జ్వరాలు అధికంగా నమోదయ్యాని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే మలేరియా అని భయపడాల్సిన అవసరం లేదన్నారు. లక్షణాల ఆధారంగా జ్వరం వచ్చిన ఒక్కరోజులోనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ ఆశ, పారామెడికల్ ఉద్యోగుల వద్ద రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఏసీటీ మందులు క్రమంగా వేసుకుంటే వ్యాధి నయమవుతుందని చెప్పారు. జ్వరాలను నిర్లక్ష్యం చేస్తేనే సమస్య తీవ్రమవుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో అత్యధికంగా ఆదివాసీలు జ్వరం వచ్చిన వెంటనే పసరమందులు, నాటు వైద్యం, మాంత్రికులను ఆశ్రయిస్తున్నారని, వ్యాధి తీవ్రమయ్యాక ఆస్పత్రికి వస్తున్నారన్నారు. ఆదివాసీలు సంప్రదాయ వైద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. మలేరియాను అరికట్టేందుకు మొదటి విడత దోమల మందు పిచికారీ ఏప్రిల్ 15న ప్రారంభించి జూన్ 15తో పూర్తి చేశామన్నారు. రెండో విడత పిచికారీ జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించామన్నారు. జీకేవీధి మండలంలో దోమల మందు పిచికారీ కొంత జాప్యం జరిగిందని, ఈ నెల 20వ తేదీ నాటికి నిర్దేశించిన గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేయాలని ఉద్యోగులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 34,900 దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో ప్రతి గ్రామానికి దోమతెరలు అందజేస్తామని తెలిపారు. పరీక్షల కిట్లు, మందులకు కొరత లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీబీపీడీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, వైద్యాధికారి రోజీ వినీతి, మలేరియా సబ్ యూనిట్ అధికారులు పోతురాజు, బుక్కా చిట్టిబాబు పాల్గొన్నారు.