మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 10:59 PM
గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) ఎం.తులసి అన్నారు.
జ్వర బాధితులు సకాలంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి
పసరమందులు, నాటు వైద్యానికిదూరంగా ఉండాలి
పరీక్ష కిట్లు, మందుల కొరతలేదు
జిల్లా మలేరియా అధికారి తులసి
చింతపల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) ఎం.తులసి అన్నారు. గురువారం చింతపల్లి ఏరియా ఆస్పత్రి, ఆర్‌వీనగర్ పీహెచ్‌సీలో మలేరియా బాధితులకు అందుతున్న వైద్యసేవలను ఆమె స్వయంగా పరిశీలించారు. మలేరియా తాజా పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌లో జరుగుతున్న రక్త పరీక్షలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా డీఎంవో తులసి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మలేరియా అదుపులో ఉందన్నారు. జనవరి నుంచి జూన్ 10వ తేదీ వరకు 1.36 లక్షల మంది జ్వరబాధితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 890 మందికి మాత్రమే మలేరియా పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం 150 మంది జ్వరబాధితులకు రక్త పరీక్షలు చేస్తే మూడు, నాలుగు మలేరియా పాజిటివ్‌లు నమోదవుతున్నాయన్నారు. ఈదులపాలెం, సింగవరం గ్రామాల్లో ఇద్దరు బాలలకు జ్వరం వచ్చినప్పటికీ సకాలంలో రక్తపరీక్షలు చేయించి మలేరియాను గుర్తించకపోవడం, చికిత్స పొందకపోవడం వల్ల మృత్యువాత పడ్డారన్నారు. జ్వరం వచ్చిన వెంటనే మలేరియా అని భయపడాల్సిన అవసరం లేదన్నారు. లక్షణాలు ఆధారంగా జ్వరం వచ్చిన ఒక్కరోజులోనే సమీపంలోనున్న పీహెచ్‌సీ, గ్రామ ఆశ, పారామెడికల్ ఉద్యోగుల వద్ద రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్థారణ జరిగితే ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఏసీటీ మందులు క్రమంగా వేసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో అత్యధికంగా ఆదివాసీలు జ్వరం వచ్చిన వెంటనే పసరమందులు, నాటు వైద్యం, మాత్రికులను ఆశ్రయిస్తున్నారని, వ్యాధి తీవ్రమయ్యాక ఆస్పత్రికి వస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మలేరియాను అరికట్టేందుకు మొదటి విడత దోమల మందు పిచికారీ ఏప్రిల్ 15న ప్రారంభించామని, ఈనెల 15వ తేదీ తో పూర్తి చేస్తామన్నారు. రెండో విడత పిచికారీ జూలై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. గిరిజనులు ఇళ్ల లోపల, బయట కచ్చితంగా పిచికారీ చేయించుకోవాలన్నారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 34,900 దోమ తెరలు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో ప్రతి గ్రామానికి దోమతెరలు అందజేస్తామన్నారు. ఆదివాసీలు ఈదోమ తెరలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీపీడీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి బుక్కా చిట్టిబాబు, ఎంటీఎస్‌లు గుమ్మ యుగంధర్, శ్రావణి పాల్గొన్నారు.