Share News

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - May 27 , 2026 | 12:03 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న లంక దినకర్‌, పక్కన కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, తదితరులు

- 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌

- అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిక

పాడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎం జన్‌మన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌, పీఎం ఆవాస్‌యోజన, పర్యాటకానికి సంబంధించిన పనుల ప్రగతిపై ఆయన ఆరా తీశారు. అలాగే జిల్లాలో విద్య, వైద్య రంగాలను మరింతగా మెరుగుపర్చాలన్నారు. అలాగే జిల్లాలో 2024-25లో రూ.393 కోట్ల వ్యయంతో 429 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, వాటిని వేగవంతం చేయాలన్నారు. రోడ్లతో పాటు వంతెనలు, అంగన్‌వాడీ భవనాలు, హెల్త్‌ సబ్‌సెంటర్లు, ఆశ్రమ పాఠశాలల్లోని అదనపు భవనాల నిర్మాణాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. పీఎం జన్‌మన్‌లో మంజూరైన 28,691 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలని, అందుకు ప్రభుత్వం రూ.403 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వికసిత్‌ భారత్‌ సాధనలో అల్లూరి సీతారామరాజు జిల్లా అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి మారుమూల ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర పథకాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్‌ వైద్య సేవ, 102, 104, 108 సేవలపై సమగ్ర సమాచారాన్ని తెలపకపోవడంపై సంబంధిత అధికారులపై దినకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రజానీకానికి సేవలందించేందుకు అంకితభావంతో పని చేయాలని , నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ టి.నిషాంతి, జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, ఏపీ జానపదకళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:03 AM