పశు సంపద వృద్ధిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:37 PM
జిల్లాలో పశు సంపద వృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్‌నినో వంటి విపత్కర కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయం కలిసి రాక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
పశు గణనకు ఆధార్ అనుసంధానం చేస్తున్న అధికారులు
10వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యం
జిల్లాలో పశు పోషకులు 2.6 లక్షల మంది
నర్సీపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశు సంపద వృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్‌నినో వంటి విపత్కర కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయం కలిసి రాక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పశు పోషణ ద్వారా రైతులకు ఆదాయ మార్గాల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
పశు గ్రాసం, పశు సంరక్షణతో పాటు అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. గత ఏడాది జిల్లాలో పశు గణన నిర్వహించారు. సుమారు రెండు లక్షల అరవై వేల మంది పశు పోషకుల వద్ద 1,87,579 ఆవులు, 2,03,524 గేదెలు, 1,80,424 గొర్రెలు, 1,99,479 మేకలు ఉన్నట్టు పశు గణన సర్వేలో తేల్చారు. దీని ఆధారంగా ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్ నంబరును రైతుల నుంచి తీసుకుంటున్నారు. జిల్లాలో 2.6 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటికి రూ.2.10 లక్ష మంది రైతులకు సంబంధించి ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా 50 వేల మంది నుంచి వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీలోగా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పశు సంవర్థక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పశు సంవర్థక శాఖ ఏడీ డబ్ల్యూ రాంబాబు వివరణ కోరగా, సబ్ డివిజన్‌లో ఆధార్ అనుసంధానం ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని పశు వైద్యులు, సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు.