క్యూ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:17 AM
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై చేస్తున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఈఓ జల్లెపల్లి వెంకటరావుతో కలిసి పరిశీలించారు.
సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశాలు
టీటీడీ, కనకదుర్గమ్మ ఆలయ అధికారులను కూడా రప్పించండి
స్లాట్ల ప్రకారం దర్శనాలు
అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడండి
సింహాచలం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై చేస్తున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఈఓ జల్లెపల్లి వెంకటరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. క్యూల నిర్వహణపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. ఎమర్జన్సీ గేట్లు ఉండేవిధంగా క్యూలు ఏర్పాటుచేయాలని, ఆ విషయం తెలిసేలా బోర్డులు పెట్టాలన్నారు. టీటీడీ, విజయవాడ కనకదుర్గ ఆలయంలో నిర్వహణ చూసే అధికారులను కూడా డిప్యూటేషన్‌పై రప్పించాలన్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ పక్కాగా జరిగేవిధంగా టీమ్‌లను ఏర్పాటుచేయాలన్నారు.
కొండదిగువ నుంచి వచ్చే బస్సులపై పర్యవేక్షణ ఉండాలని, పికప్, డ్రాపింగ్ పాయింట్స్ వద్ద అప్రమత్తతతో మెలగాలి. వీఐపీలు వేచి ఉండే విధంగా ప్రత్యేక వసతి ఏర్పాటుచేయాలని, అంతరాలయ దర్శనం ప్రక్రియ అంతా గంటలో ముగించాలన్నారు. సాధారణ భక్తులకు, వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాన్నారు. స్లాట్ల ప్రకారం దర్శనాలు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. క్యూలు, పెండాల్స్, విద్యుదీకరణ, ఇంజనీరింగ్ వర్క్స్ విషయంలో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలన్నారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించాలన్నారు. డ్యూటీ అధికారులు నిర్ణీత సమయం కంటే ముందే తమ పాయింట్‌కు చేరుకోవాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం,సూచనలు అందజేస్తుండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేరీ ప్రశాంతి, మణికంఠ చందోల్, లతామాధురి, ఏసీపీ పేడాడ ప్రదీప్తి, దేవస్థానం ఈఈ బండారు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
చందనోత్సవానికి 300 స్పెషల్ బస్సులు
20వ తేదీ తెల్లవారుజాము నుంచి 21వ తేదీ ఉదయం వరకూ నిర్వహణ
ద్వారకా బస్‌స్టేషన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సింహాచలానికి 300 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. ఇవికాకుండా 80 బస్సులను కొండదిగువ నుంచి పైకి షటిల్ సర్వీసులుగా నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి మరునాటి ఉదయం వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులను పెందుర్తి, పాతపోస్టాఫీస్, ఆర్‌కే బీచ్, మధురవాడ, గాజువాక, సింథియా, ఉక్కునగరం, కూర్మన్నపాలెం, మద్దిలపాలెం, తగరపువలస ప్రాంతాల నుంచి సింహాచలం కొండ దిగువ వరకూ నడపనున్నట్టు ఆర్‌ఎం అప్పలనాయుడు తెలిపారు. కొండ దిగువ నుంచి పైకి షటిల్ సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయన్నారు.