ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:07 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి, ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్థులపై రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలను బాగా రాసి, కచ్చితంగా ఉత్తీర్ణులయ్యేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 24వ తేదీన ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులు, ప్రతి చాప్టర్ కవర్ అయ్యేలా రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ వచ్చే నెల 20వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేని వారికి నెలపాటు బోధన
అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహణ
విద్యార్థులు, అధ్యాపకుల హాజరుపై రోజూ నివేదిక
చోడవరం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి, ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్థులపై రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలను బాగా రాసి, కచ్చితంగా ఉత్తీర్ణులయ్యేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 24వ తేదీన ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులు, ప్రతి చాప్టర్ కవర్ అయ్యేలా రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ వచ్చే నెల 20వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 500 మంది, సెకండియర్ విద్యార్థులు 400 మంది వున్నారు. వీరికి బోధించడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి అధ్యాపకులు సైతం హాజరువాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతేక తరగతులకు విద్యార్థి ఎవరైనా హాజరుకాకపోతే, అతను/ ఆమె తల్లిదండ్రులకు అధ్యాపకులు ఫోన్ చేసి కారణం తెలుసుకుంటారు. అంతేకాక ఈ సమాచారాన్ని ఇంటర్ బోర్డు అధికారులకు తెలియపరచాల్సి వుంటుంది. ప్రత్యేక తరగతులు మొక్కుబడిగా కాకుండా, హాజరయ్యే విద్యార్థులతోపాటు, లెక్చరర్ల వివరాలను రోజూ ఉదయం, సాయంత్రం పంపించాలని ఆదేశించారు. కళాశాలల వారీగా ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారో గుర్తించి, ఇప్పుడు ఆ సబ్జెక్టుపై సంబంధిత లెక్చరర్ మరింత శ్రద్ధ వహించాల్సి వుంటుంది. దీంతో అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. వచ్చే నెల 21న సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి. వీటికి హాజరయ్యే విద్యార్థులంతా ఉత్తీర్థులు అయ్యేలా శిక్షణ ఇవ్వాలని, ఈ బాధ్యతను ప్రిన్సిపాళ్లతోపాటు అధ్యాపకులు కడూఆ తీసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలి
ప్రత్యేక శిక్షణ తరగతులకు విద్యార్థులందరూ హాజరు కావాలంటే వారికి రోజూ మధ్యాహ్నం భోజనాన్ని ప్రభుత్వం సమకూరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కళాశాలకు దూరంగా వున్న గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరతారని, ఈ సమయానికి ఇళ్లల్లో వంటలు పూర్తికావని అంటున్నారు. మధ్యాహ్న భోజనం సమకూరిస్తే విద్యార్థులందరూ సకాలంలో శిక్షణ తరగతులకు హాజరయ్యే అవకాశం వుంటుందని అభిప్రాయపడుతున్నారు.