Share News

ఓటరు జాబితాల పరిశీలనకు ప్రత్యేక ప్రచారం

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:33 PM

ఈనెల 22 నుంచి నిర్వహించే ఓటర్ల జాబితాల పరిశీలనకు ప్రత్యేక ప్రచార దినాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఓటరు జాబితాల పరిశీలనకు ప్రత్యేక ప్రచారం
జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిషాంతి

22, 23, 29, 30 తేదీల్లో పేర్లు సరిచూసుకోవాలి

లేకుంటే బూత్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలి

అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచన

పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):

ఈనెల 22 నుంచి నిర్వహించే ఓటర్ల జాబితాల పరిశీలనకు ప్రత్యేక ప్రచార దినాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు ఈప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తారన్నారు. అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించడమే ముఖ్యమన్నారు. ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాల్లో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాలను ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవాలని, ఏదైనా కారణాలతో వివరాలు తప్పుగా నమోదు కావడం లేదా పేరు తొలగిపోవడం వంటివి గుర్తిస్తే తక్షణమే సంబంధిత బూత్‌ స్థాయి అధికారికి తమ అభ్యంతరాలను తెలపాలన్నారు. జిల్లాలోని అర్హులైన ఓటర్లంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని, నాణ్యమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్‌ నిషాంతి పేర్కొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 10:33 PM