మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:01 AM
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రావికమతం మండలం కల్యాణపులోవ, గొలుగొండ మండలం ధారమఠం, విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పుణ్యగిరి శైవక్షేత్రాలకు జిల్లా నుంచి 95 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డీపీటీవో ప్రవీణ చెప్పారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది శివరాత్రికి 75 ప్రత్యేక బస్సులు నడిపామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత మహిళా ప్రయాణికుఉలు పెరగడంతో ఈ ఏడాది మరో 20 బస్సులను అదనంగా నడుపుతున్నామని తెలిపారు.
అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి నిర్వహణ
కల్యాణపులోవకు 80, ధారమఠానికి పది, పుణ్యగిరికి ఐదు బస్సులు
స్ర్తీ శక్తి పథకం కింద జనవరి వరకు 91,71,953 మంది ఉచిత ప్రయాణం
ఆర్టీసీ డీపీటీవో ప్రవీణ వెల్లడి
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రావికమతం మండలం కల్యాణపులోవ, గొలుగొండ మండలం ధారమఠం, విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పుణ్యగిరి శైవక్షేత్రాలకు జిల్లా నుంచి 95 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డీపీటీవో ప్రవీణ చెప్పారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది శివరాత్రికి 75 ప్రత్యేక బస్సులు నడిపామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత మహిళా ప్రయాణికుఉలు పెరగడంతో ఈ ఏడాది మరో 20 బస్సులను అదనంగా నడుపుతున్నామని తెలిపారు. కల్యాణపులోవకు అనకాపల్లి డిపో నుంచి 35 బస్సులను, నర్సీపట్నం డిపో నుంచి 40 బస్సులను, ధారమఠానికి నర్సీపట్నం డిపో నుంచి 10 బస్సులను నడపనున్నామన్నారు. చోడవరం నుంచి కల్యాణపులోవకు ఐదు బస్సులు, అనకాపల్లి నుంచి ఐదు బస్సులను పుణ్యగిరికి నడపనున్నట్టు చెప్పారు. ఈ బస్సులన్నీ 15వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో వుంటాయని పేర్కొన్నారు. గతంలో కల్యాణపులోవ సమీపానికి ఆర్టీసీ బస్సులు వెళ్లడానికి అవకాశం వుండేది కాదని, అయితే ఈసారి పోలీసు అధికారులు పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేయడంతో ఆలయం సమీపం వరకు బస్సులు వెళతాయని ఆమె తెలిపారు.
కాగా స్త్రీ శక్తి పథకం ద్వారా గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 97 లక్షల 71 వేల 952 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం సాగించారన్నారు. వీరిలో 60 లక్షల 86 వేల 970 మంది అనకాపల్లి డిపో నుంచి, 36 లక్షల 84వేల 982 మంది నర్సీపట్నం డిపో నుంచి ప్రయాణం సాగించారన్నారు. 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన బస్సులు అనకాపల్లి డిపోలో ఆరింటిని, నర్సీపట్నం డిపోలో ఐదింటిని నిలిపివేశామని తెలిపారు. కొత్త బస్సుల కేటాయింపునకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని డీపీటీవో ప్రవీణ పేర్కొన్నారు.