Share News

స్పెషల్‌బ్రాంచి సిబ్బంది దందా

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:04 AM

నగర పోలీస్‌ కమిషనర్‌కు కళ్లు, ముక్కు, చెవులుగా చెప్పుకునే స్పెషల్‌బ్రాంచి విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పెషల్‌బ్రాంచి సిబ్బంది దందా

శివారు ప్రాంతాల్లో పేకాట, కోడిపందేల నిర్వాహకులతో కుమ్మక్కు

అంతా పూర్తయిన తర్వాత అధికారులకు సమాచారం

దాడులకు వెళితే అక్కడ ఎవరూ కనిపించని పరిస్థితి

కావాలనే సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనర్‌కు కళ్లు, ముక్కు, చెవులుగా చెప్పుకునే స్పెషల్‌బ్రాంచి విభాగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగంలో ఏసీపీ, ఏడీసీపీ పోస్టులు ఖాళీగా ఉండడంతో కిందిస్థాయి సిబ్బందిని పర్యవేక్షించేవారు లేకుండాపోయారు. దీంతో కొంతమంది సిబ్బంది పేకాట, కోడిపందాలు నిర్వహించే వారితో మిలాఖత్‌ అవుతున్నారంటున్నారు. ఈ విషయంలో నగర శివారు ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన సిబ్బందిపై మరింతగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రముఖుల రాకపోకలతోపాటు సంఘ విద్రోహుల కదలికలు, అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి సంబంధించిన సమాచారంతోపాటు పోలీస్‌ స్టేషన్లలో అఽధికారులు, సిబ్బంది పనితీరు, స్టేషన్‌కు వచ్చేవారి అభిప్రాయాలను రహస్యంగా సేకరించి తమ పైఅధికారుల ద్వారా పోలీస్‌ కమిషనర్‌కు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు స్పెషల్‌బ్రాంచి విభాగం పనిచేస్తుంది. స్పెషల్‌బ్రాంచి విభాగంలో ఏడీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఒక ఏసీపీ, నలుగురైదుగురు సీఐలు ఉంటారు. వీరుకాకుండా ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒక కానిస్టేబుల్‌/హెడ్‌ కానిస్టేబుల్‌ పనిచేస్తుంటారు. స్టేషన్‌ పరిధిలో సమాచారాన్ని సంబంధిత స్పెషల్‌బ్రాంచి కానిస్టేబుల్‌/హెడ్‌ కానిస్టేబుల్‌ తన ఉన్నతాధికారుల ద్వారా సీపీకి చేరవేయాల్సి ఉంటుంది. అయితే స్పెషల్‌ బ్రాంచిలో కొందరు అధికారులు, సిబ్బంది తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా తప్పుడు సమాచారాన్ని అందజేస్తుండడం, అవినీతికి పాల్పడే సీఐలు, సిబ్బందిని బెదిరించి డబ్బులు గుంజడం, తమను ప్రసన్నం చేసుకోనివారిపై ప్రతికూల సమాచారం ఇవ్వడం వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా స్పెషల్‌బ్రాంచ్‌ను సీపీలుగా పనిచేస్తున్నవారు పట్టించుకోవడం మానేశారు. తమ సొంత నెట్‌వర్క్‌ ద్వారా సమాచారం సేకరించుకోవడంపై దృష్టిసారించారు. దీనివల్ల స్పెషల్‌బ్రాంచి విభాగం ప్రతిష్ఠ మసకబారుతూ వస్తోంది. ప్రస్తుతం స్పెషల్‌బ్రాంచి విభాగంలో ఏడీసీపీ, ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించారు. పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిని నేరుగా పర్యవేక్షించే పరిస్థితి లేదు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పేకాట, కోడిపందాల నిర్వాహకులతో కుమ్మక్కు

నగర శివారు ప్రాంతాలైన ఆనందపురం, పధ్మనాభం, భీమిలి, దువ్వాడ, న్యూపోర్టు, పెందుర్తి, గోపాలపట్నం వంటి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిత్యం పేకాట, కోడిపందాలు జరుగుతున్నాయి. దీనికి సంబంఽధించిన సమాచారం శివారు ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లలో స్పెషల్‌బ్రాంచి కానిస్టేబుల్‌/హెడ్‌ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి ముందుగానే అందుతుంటుంది. కానీ పేకాట, కోడిపందాలు జరిగినంతసేపు సమాచారం బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచి, వారంతా అక్కడి నుంచి ముగించి వెళ్లిపోతారనే సమయంలో తమ ఉన్నతాధికారుల ద్వారా సీపీకి సమాచారం చేరవేస్తున్నారు. ఫలానా ప్రాంతంలో కోడిపందాలు లేదా పేకాట జరుగుతోందని, వెంటనే ప్రత్యేక బృందాలతో వెళ్లాలంటూ సంబంధిత ఏసీపీకి, సీఐలకు నేరుగా సీపీ ఆదేశాలు జారీచేస్తున్నారు. అధికారులు, సిబ్బంది ఆగమేఘాల మీద సీపీ చెప్పిన చోటకు వెళితే, అక్కడ ఎవరూ కనిపించని పరిస్థితి ఉంటుంది. దీంతో దాడులకు వెళ్లిన వారిలోనే ఎవరో సమాచారాన్ని నిర్వాహకులకు చేరవేశారంటూ స్పెషల్‌బ్రాంచి సిబ్బందే తిరిగి సీపీకి చెబుతున్నారని కొందరు పోలీస్‌ అధికారులు వాపోతున్నారు. ఇటీవల నార్త్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో రెండుచోట్ల కోడిపందాలు, ఒకచోట పేకాట జరుగుతున్నట్టు సమాచారం సీపీ నుంచి రాగానే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బంది దాడులు చేశారు. అయితే ఆయా చోట్ల ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగివచ్చారు.

Updated Date - Mar 27 , 2026 | 01:04 AM