పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:20 AM
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందులో భాగంగానే అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎస్.తేజ్‌భత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ, ఫ్లవర్ షోలో రకరకాల పూలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు ఆకట్టుకుంటున్నాయని అన్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో పుష్ప ప్రదర్శన ప్రారంభం
ఆకట్టుకుంటున్న వివిధ రకాల ఆకృతులు
అనకాపల్లి టౌన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందులో భాగంగానే అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎస్.తేజ్‌భత్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ, ఫ్లవర్ షోలో రకరకాల పూలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అనకాపల్లి జిల్లాలో బీచ్, టెంపుల్ టూరిజంను అభివృద్ధి పరచాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతామని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని అన్నారు. అనంతరం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎ.రాజశేఖరం, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు కల్యాణి, అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయీషా, డీఎస్పీ శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకొంటున్న పుష్ప ప్రదర్శన
అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన సందర్శకులకు కనువిందు చేస్తున్నది. వివిధ రకాల పూలతో రూపొందించిన వినాయకుడు, రెండు వైపులా ఏనుగులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇంకా పూలతో తయారు చేసిన హంస వాహనంపై వేంకటేశ్వరస్వామి, ఊయల, ఎడ్ల బండి, జట్కా బండి, జలపాతం, సముద్రంలో పయనిస్తున్న పడవ, డాల్ఫిన్ చేపలు, పెంగ్విన్‌లు, విమానం, పుట్టగొడుగులు, ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారులు, క్రికెట్ బ్యాట్, మగ్గులో నుంచి కప్పులోకి కాఫీ పోసే ఆకృతి, వీణ, మత్స్యం, మకరం వంటి వివిధ రకాల ఆకృతులు అబ్బురపరుస్తున్నాయి. సాధారణ ప్రజానీకంతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్ప ప్రదర్శనను తిలకిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పుష్ప ప్రదర్శన వుంటుందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.