Share News

గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:25 AM

ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ కందమామిడి బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పాడేరు మండలం కందమామిడి ఆశ్రమ పాఠశాలలో బాలికలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంతి

అధికారులు, ఉపాధ్యాయులకు కలెక్టర్‌ ఆదేశం

కందమామిడి బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన

పాడేరు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ కందమామిడి బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. నాణ్యమైన విద్య, పోషకాహారం, సదుపాయాలతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బాలికలకు నిర్వహించే వైద్య పరీక్షలు, ఆశ్రమ పాఠశాలల్లోని వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు. భోజన మెనూ అమలు తీరును బాలికలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, హెచ్‌ఎం, వార్డెన్‌లు బాలికల పట్ల శ్రద్ధ కనబరచాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో యోగా సాధన చేసే రోజున తాను వస్తానని కలెక్టర్‌ బాలికలకు తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్‌.. హెచ్‌ఎం సంతకం లేకపోవడాన్ని గమనించి అసహనం వ్యక్తం చేసి ఏటీడబ్ల్యూ, హెచ్‌ఎం కలెక్టరేట్‌కు వచ్చి తనను కలవాలని ఆదేశించారు.

Updated Date - Apr 23 , 2026 | 12:25 AM