జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:30 AM
జడ్పీ చైర్‌పర్సన్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ సీఈవో పి.వాసుదేవరావు తెలిపారు.
మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులకు కూడా..
సీఈవో పి.వాసుదేవరావు
చింతపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
జడ్పీ చైర్‌పర్సన్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ సీఈవో పి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం జడ్పీ చైర్‌పర్సన్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీవోలతో ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్(కోఆప్షన్) సభ్యుల ఎన్నిక ఈ నెల 19న ప్రతి మండలంలోనూ, జడ్పీ చైర్‌పర్సన్, జడ్పీ వైస్ చైర్మన్, ఇద్దరు కోఆప్టెడ్(కోఆప్షన్) సభ్యుల ఎన్నిక 20వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి సభ్యులందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో 19వ తేదీ ఉదయం పది గంటలలోపు కోఆప్టెడ్ సభ్యుడి కోసం అర్హులైన భాష, మతపరమైన మైనారిటీ సభ్యులు నామినేషన్ దాఖలు చేయాల్సి వుంటుందన్నారు. కోఆప్టెడ్ సభ్యుడికి ఒక ఎంపీటీసీ సభ్యుడు ప్రతిపాదించగా, మరో సభ్యుడు మద్దతు ప్రకటించాల్సి వుంటుందన్నారు. 10 నుంచి 12 గంటల మఽధ్యలో నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఒంటి గంట తరువాత ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుందన్నారు. అనంతరం కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక చేతులెత్తే పద్ధతిన జరుగుతుందని చెప్పారు. మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక ప్రారంభమవుతుందన్నారు. ఎంపీపీగా పోటీ చేసే అభ్యర్థిని ఒక ఎంపీటీసీ సభ్యుడు ప్రతిపాదించగా, మరో సభ్యుడు మద్దతు ఇవ్వాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ మందిని ఎంపీపీగా ప్రతిపాదిస్తే చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరుగుతుందని, సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ఇదే పద్ధతిలో వైస్ ఎంపీపీకి ఎన్నిక జరుగుతుందన్నారు. కోఆప్టెడ్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు కచ్చితంగా కోరం ఉండాలన్నారు. 20వ తేదీన కలెక్టరేట్‌లో పది గంటలలోపు కోఆప్టెడ్ సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుందని చెప్పారు. కోఆప్టెడ్ ఎన్నికల అనంతరం మూడు గంటలకు జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేతులెత్తే పద్ధతిలో జరుగుతుందన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీచైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌గా ప్రతిపాదించిన వ్యక్తులు ముందు రోజే ప్రిసైడింగ్ అధికారికి ఫారం ఏ, బీలు సమర్పించాలన్నారు. విప్ వర్తింపజేసేందుకు నమూనా(అనెగ్జర్)-1, 2, అక్నాలజీమెంట్ ప్రిసైడింగ్ అధికారి అందజేయాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికల నిర్వహణలో ఈ నిబంధనలు ప్రిసైడింగ్ అధికారులు విధిగా పాటించాలన్నారు. ఆయన వెంట స్థానిక ఎంపీడీవో లాలం సీతయ్య ఉన్నారు.