ప్రాదేశిక ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:08 AM
ప్రశాంత వాతావరణంలో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంగి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు. బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్
చింతపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంగి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించారు. బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీన నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ, ఓటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు ఓటరు గుర్తింపు కార్డు, విధుల ఉత్తర్వులు తీసుకొచ్చి బ్యాలెట్ ఓటు పొందవచ్చునన్నారు. సర్వీసు ఉద్యోగులకు సైతం బ్యాలెట్ ఓట్లు పంపించామన్నారు. అనంతరం చింతపల్లి గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సదుపాయం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు వెంకటరమణ, బాబూనాయక్, ఎంపీడీవోలు లాలం సీతయ్య, రమణబాబు, ఎంఈవో పీబీవీవీవీ ప్రసాద్, లైజనింగ్ అధికారి పట్టాసి చలపతిరావు పాల్గొన్నారు.