Share News

నేటి నుంచి ప్రత్యేక పాలన

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:31 PM

ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌గా ఉన్న పాలకవర్గం గడువు గురువారం ముగియడంతో పాటు కొత్త జిల్లాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నేటి నుంచి ప్రత్యేక పాలన
జడ్పీ కార్యాలయాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించే పాడేరు ఎంపీడీవో కార్యాలయం

జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

ప్రతి మండలానికి ప్రత్యేకాధికారుల నియామకం పూర్తి

నేడు ఎంపీడీవో కార్యాలయంలో లాంఛనంగా కార్యాలయం ప్రారంభం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఇన్నాళ్లూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌గా ఉన్న పాలకవర్గం గడువు గురువారం ముగియడంతో పాటు కొత్త జిల్లాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో శుక్రవారం నుంచి జిల్లాలోనే నూతనంగా జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఇందులో భాగంగా జడ్పీకి కలెక్టర్‌ టి.నిషాంతిని ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించగా, మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా కలెక్టర్‌ నియమించారు. పాడేరు మండలానికి జి.జయకృష్ణ, అనంతగిరికి వీఏ స్వామినాయుడు, అరకులోయకు ఎం.శ్రీధర్‌, చింతపల్లికి ఆర్‌వీ రమణారావు, డుంబ్రిగుడకు ఎస్‌బీఎస్‌ నందు, జీకేవీధికి బి.బాబునాయక్‌, జి.మాడుగులకు డీవీ విద్యాసాగర్‌, హుకుంపేటకు కేపీ చంద్రశేఖర్‌, కొయ్యూరుకు పీఎస్‌ కుమార్‌, ముంచంగిపుట్టుకు వి.మోహన్‌బాబు, పెదబయలుకు డి.రాధామాధవిలను ప్రత్యేకాధికారులుగా నియమించారు. దీంతో ఇకపై మండల పరిషత్‌ పాలన వీరి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అలాగే జడ్పీ కార్యాలయానికి అవసరమైన 19 మంది సిబ్బందిని కేటాయించారు.

పాతపాడేరు సామాజిక భవనంలో జడ్పీ కార్యాలయం

స్థానిక పాతపాడేరులోనే జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన సామాజిక భవనానికి మెరుగులు దిద్దేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. వాస్తవానికి గత ఐదు రోజులుగా భారీ వర్షాలు లేకుంటే ఈపాటికి చాలా వరకు పనులు పూర్తయ్యేవి. కానీ ప్రస్తుత ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోనే లాంఛనంగా జడ్పీ కార్యాలయాన్ని కలెక్టర్‌ టి.నిషాంతితో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:31 PM