Share News

పరిశోధన ఫలితాలు రైతులకు చేరేలా ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:30 PM

లాభసాటి వ్యవసాయానికి శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని గుంటూరు లామ్‌ ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు(డీఈ) డాక్టర్‌ జి.శివనారాయణ తెలిపారు.

పరిశోధన ఫలితాలు రైతులకు చేరేలా ప్రత్యేక కార్యాచరణ
పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న గ్లాడియోలస్‌ను పరిశీలిస్తున్న డాక్టర్‌ జి.శివనారాయణ

డాట్‌ సెంటర్లు, కేవీకే సేవలు విస్తృతం

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం

విత్తనోత్పత్తికి అధిక ప్రాధాన్యం

ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీఈ డాక్టర్‌ జి.శివనారాయణ

చింతపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): లాభసాటి వ్యవసాయానికి శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని గుంటూరు లామ్‌ ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు(డీఈ) డాక్టర్‌ జి.శివనారాయణ తెలిపారు. మంగళవారం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఆయన సందర్శించారు. పరిశోధన స్థానంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించారు. శాస్త్రవేత్తలతో సమావేశమై విస్తరణ విభాగంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధన స్థానంలో జరుగుతున్న పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలను ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి వివరించారు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినులతో డీఈ ముచ్చటించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జి.శివనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలో 13, స్వచ్ఛంద సేవా సంస్థ పరిధిలో మూడు కృషి విజ్ఞాన కేంద్రాలు, 13 జిల్లా ఏరువాక కేంద్రాలు(డాట్‌ సెంటర్‌)లు ఉన్నాయన్నారు. కేవీకే, ఏరువాక కేంద్రాల ద్వారా రైతుల వ్యవసాయ ప్రగతికి పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులకు సాంకేతికపరమైన శిక్షణలు అందజేసి రైతులు వ్యవసాయంలో ఎదుర్కొనే సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపిస్తున్నామన్నారు. పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు చేపట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన వంగడాలను కేవీకే, డాట్‌ సెంటర్ల ద్వారా రైతులకు చేరవేస్తూ సేవలను విస్తృతం చేశామని చెప్పారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం

రైతులను కేవీకేల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామని డీఈ డాక్టర్‌ శివనారాయణ తెలిపారు. వ్యవసాయంతో పాటు పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీలతో పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకానికి ప్రత్యేక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తి

గిరిజన ప్రాంతంలో అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్‌ శివనారాయణ తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మేలిరకం రాజ్‌మా, వలిసెలు, వరి, పసుపు, అల్లం వంగడాలను రైతులకు అందించేందుకు విస్తరణ విభాగం కృషి చేస్తున్నదన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను పరిశోధన స్థానంలో ఉత్పత్తి చేయడం సాధ్యంకాదని, ఈ మేరకు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వంగడాలను అభ్యుదయ రైతులకు అందజేసి అధిక మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అభ్యుదయ రైతులు ఉత్పత్తి చేసిన వంగడాలను ఇతర రైతులకు అందజేస్తామన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్‌ చేసుకుని అధిక ఆధాయం పొందేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రధానంగా మిరియాలు, పసుపు, రాజ్‌మా, వలిసెలను విలువలు జోడించి మార్కెటింగ్‌ చేసుకుంటే రెండింతలు అధిక ఆదాయం రైతులకు లభిస్తుందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రైతులు వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. రైతులు వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పొందేందుకు 18004250430 విశ్వవిద్యాలయం టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేయవచ్చునన్నారు. అలాగే 155251 సమీకృత సమాచార కేంద్రానికి ఫోన్‌ చేయవచ్చునన్నారు. రైతులు వాట్సాప్‌ ద్వారా పంటలను ఆశించిన చీడపీడల చిత్రాలను పంపిస్తే శాస్త్రవేత్తలు నివారణ చర్యలు తెలియజేస్తారని ఆయన చెప్పారు. రైతులు స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా సులభంగా శాస్త్రవేత్తల సేవలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బాలహుస్సేన్‌ రెడ్డి, శాస్త్రవేత్తలు సందీప్‌ నాయక్‌, జోగారావు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:30 PM