వ్యవసాయ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:18 PM
ఆదివాసీ వ్యవసాయ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ డి. ఆదిలక్ష్మి అన్నారు.
వరిలో కొత్త రకాలపై అధ్యయనం
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు,
ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
గంజాయికి ప్రత్యామ్నాయంగా పూల సాగు
గిరిజన ఉప ప్రణాళికలో ప్రతిపాదనలు
ఏడీఆర్ డాక్టర్ డి. ఆదిలక్ష్మి
చింతపల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
ఆదివాసీ వ్యవసాయ ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ డి. ఆదిలక్ష్మి అన్నారు. శుక్రవారం పరిశోధన స్థానంలో పచ్చిరొట్ట ఎరువు కలిగియదున్న పొలాలను పరిశీలించి, వరి పరిశోధనలపై శాస్త్రవేత్తలకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లాలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గిరిజనులు వ్యవసాయంలో రాణించేందుకు పరిశోధన స్థానం ద్వారా అత్యాధునిక సాంకేతిక సహకారం, నూతన వంగడాలు, వాణిజ్య పంటలను రైతులకు పరిచయం చేస్తామన్నారు. ప్రధానంగా రైతులకు నాణ్యమైన వరి విత్తనాలను అందించేందుకు పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. నాలుగేళ్లలో రైతులకు నాణ్యమైన వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పడిపోతుందని, విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా రాగి, సామ, కొర్ర సాగును ప్రోత్సహిస్తూ నాణ్యమైన వంగడాలను రైతులకు పంపిణీ చేసేందుకు గిరిజన ఉప ప్రణాళిక(టీఎస్‌పీ)లో ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. రైతులు చిరుధాన్యాలను నేరుగా విక్రయించుకోకుండా ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్ ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం అధికారులను కోరామన్నారు. టీఎస్‌పీలో ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల రైతులకు రెట్టింపు ధర వస్తుందన్నారు. వలిసెలలో పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన సీటీపీ-1 వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఏడాది ముందస్తు రబీలో వలిసెల సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు. రాజ్‌మాలో మేలిజాతి రకాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. వేరుశనగ, కొమ్ముశనగలోనూ మేలిజాతి వండగాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు కొనసాగిస్తామన్నారు. పూలసాగుపై పరిశోధనలు పునఃప్రారంభిస్తామన్నారు. గంజాయికి ప్రత్యామ్నాయ పంటగా రైతులకు పూలసాగును పరిచయం చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాన్ని ప్రభుత్వం ఆర్గానిక్ హబ్‌గా ప్రకటించిందని, రైతులందరూ ఆర్గానిక్ పద్ధతిలోనే పంటన్నీ సాగు చేసేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో జీవన ఎరువులు యూనిట్ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రభుత్వానిక ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ పాల్గొన్నారు.