Share News

ముత్యాలమ్మ జాతరకు స్థల సమస్య

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:12 PM

స్థానిక ముత్యాలమ్మ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థల సమస్య నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాల వేదికల ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

ముత్యాలమ్మ జాతరకు స్థల సమస్య
జడ్పీ హైస్కూల్‌ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటు చేయనున్న ప్రదేశం

సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై సందిగ్ధం

చింతపల్లి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక ముత్యాలమ్మ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థల సమస్య నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాల వేదికల ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. గత కొన్నేళ్లుగా ప్రధాన వినోద కార్యక్రమాల వేదికగా ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో ఇప్పుడు టైప్‌-2 కస్తూర్బా గాంధీ పాఠశాలను నిర్మిస్తున్నారు. దీంతో వేదిక ఏర్పాటు చేసేందుకు స్థలం సరిపడడం లేదు. రెండో వేదికను సబ్‌ జైలు వద్ద ఏర్పాటు చేస్తుండగా, ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోందని పోలీసులు అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాల వేదికల ఏర్పాటుపై ఉత్సవ కమిటీ ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముత్యాలమ్మ జాతర ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్నది. జాతర 15న ప్రారంభంకానుంది. సాంస్కృతిక కార్యక్రమాల ప్రధాన వేదికను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గత ఏడాది వరకు ఏర్పాటు చేసేవారు. అయితే ఆరు నెలల క్రితం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో బాలికల వసతి కోసం టైప్‌-2 కస్తూర్బాగాంధీ పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. దీని వలన మైదానం విస్తీర్ణం తగ్గిపోయింది. మరో ప్రత్యామ్నాయ స్థలం అందుబాటులో లేక ఈ ఏడాదికి అక్కడే వేదికను ఏర్పాటు చేసేందుకు ఉత్సవ కమిటీ ప్రయత్నిస్తున్నది. ఇక రెండో వేదికను సబ్‌ జైలు వద్ద ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తుండగా, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోందని, డిగ్రీ కళాశాల మైదానంలో వేదికను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సబ్‌ జైలు వద్ద వేదికను ఏర్పాటు చేస్తామని, డిగ్రీ కళాశాల మైదానం గ్రామానికి దూరమైపోతుందని ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు నచ్చజెప్పారు. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఆర్‌అండ్‌బీ కార్యాలయాల వద్ద ఉన్న మైదానంలో స్టాళ్లు, ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో భక్తుల కోసం మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ మైదానం జెయింట్‌వీల్స్‌కి కేటాయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకే ఎక్కడా స్థలం లేకుండాపోయింది. దీనిపై ఉత్సవ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Apr 05 , 2026 | 11:12 PM