విమ్స్‌లో హృదయ ఫౌండేషన్‌కు స్థలం.?
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:22 AM
గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు హృదయ ఫౌండేషన్ ముందుకువచ్చింది.
గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు వైద్య సేవలు
సీఎం ఎదుట ఆసక్తిని తెలియజేసిన సంస్థ ప్రతినిధులు
ముఖ్యమంత్రి ఆదేశాలతో విమ్స్‌లో స్థల లభ్యతను పరిశీలించిన ఆరోగ్యశాఖ అధికారులు
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు హృదయ ఫౌండేషన్ ముందుకువచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిఽ దులు సీఎం చంద్రబాబు నాయుడుకు తమ ఆసక్తిని తెలియజేయడంతోపాటు సేవలు అందించేందుకు అవసర మైన స్థలాన్ని కోరినట్టు తెలిసింది. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా ఆరోగ్యశాఖ అధికారులకు బాధ్యతను అప్పగించారు. దీంతో వారు ఆదివారం విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను పరిశీలించారు.
సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమ్స్‌లో పది ఎకరాలను హృదయ ఫౌండేషన్‌కు అందించేందుకు ఉన్న అవకాశాలపై ఆస్పత్రి అధికారులతో చర్చించినట్టు సమాచారం. కాగా విమ్స్ భవిష్యత్తు అవసరాలు, విస్తరణ ప్రతిపాదనల నేపథ్యంలో స్థలాన్ని ఇవ్వడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఆస్పత్రి అధికారులు తెలియజేశారు. దీనిపై మరోసారి ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్‌తో సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
వైద్యసేవలు అందించేదిలా..
కొన్నేళ్లుగా నిరుపేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబా లకు చెందిన గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు హృదయ ఫౌండేషన్ సహాయాన్ని అందిస్తోంది. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులను గుర్తించడం, అవస రమైన వారికి శస్త్రచికిత్సలు చేయడం, ఆర్థిక సహాయం అందించడం, స్ర్కీనింగ్ క్యాంపులు నిర్వహించి బాధితుల ను గుర్తించడం, ఆర్థిక సహాయం అవసరమైన వారికి నిధులు సమీకరించడం వంటి కార్యకలాపాలను చేపడుతోంది. ఈ సంస్థకు స్థలం ఇస్తే ఆస్పత్రి ఏర్పాట్లు చేస్తారా.? సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తారా.? అన్నది తెలియాల్సి ఉంది. విమ్స్‌ను సందర్శించిన అధికారులు ఇక్కడి పరిస్థితులు, భూలభ్యత, ఇతర అంశాలను కలెక్టర్‌కు నివేదించనున్నారు.
త్వరలో బేబీ కిట్లు
పంపిణీకి సన్నాహాలు!
టీడీపీ హయాంలో 2014లో పథకం ప్రారంభం
నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం
పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు
రూ.1400 విలువజేసే కిట్‌లో 14 రకాల వస్తువులు
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
నవజాత శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన బేబీ కిట్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బేబీ కిట్లు అందించే కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. దీనివల్ల ప్రసవానంతరం చిన్నారులకు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట పడలేదు. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించేందుకు బేబీకిట్‌లో అందించే వస్తువులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని వస్తువులతో కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
గతంలో అందించిన బేబీ కిట్‌లో కంటే అదనంగా మరిన్ని వస్తువులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతంలో ఆరేడు రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించగా, తాజాగా 14 రకాల వస్తువులను అందించే చర్యలు చేపడుతోంది. దీని ఖరీదు సుమారు రూ.1400 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రసవానంతం చిన్నారులను వేధించే కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు అవసరమైన సబ్బులు, ఆయిల్స్, దోమ తెర ఇందులో ఉంటాయంటున్నారు.
కిట్‌లో ఉండే వస్తువులు..
తాజాగా ప్రభుత్వం అందించాలని భావిస్తున్న కిట్‌లో దోమతెరతో కూడిన బేబీ బెడ్, బేబీ మాకింటోష్ (వాటర్ ఫ్రూఫ్‌షీట్), బేబీ దుస్తులు, బేబీ తువ్వాళ్లు, బేబీ పౌడర్-200 గ్రాములు, బేబీ షాంపూ-100 మిల్లీలీటర్లు, బేబీ ఆయిల్ 200 మిల్లీలీటర్లు, బేబీ సబ్బు, బేబీ న్యాపీలు, బేబీ సబ్బు, సబ్బుపెట్టె, గిలక్కాయ/రాటిల్ బొమ్మ, బేబీ కిట్‌బ్యాగ్‌తోపాటు మరో రెండు రకాల వస్తువులు ఉంటాయి.
పంపిణీ ఎవరికంటే.?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే బాలింతలకు ఈ కిట్లను అందించనున్నారు. ఈ వస్తువులు బయట కొనుగోలు చేయాలంటే సుమారు రూ.3 వేల వరకు ఖర్చ వుతుంది. ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి అందిస్తుండడం వల్ల ఒక్కో నవజాత శిశువు కుటుంబానికి మేలు చేకూరనుంది. జిల్లాలో కేజీహెచ్, ఘోష, అగనంపూడి ఏరియా ఆస్పత్రి, పెందుర్తి, గోపాలపట్నం, భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతినెలా సుమారు 500 నుంచి 700 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీరందరికీ ప్రభుత్వం అందించనున్న కిట్లతో లబ్ధి చేకూరనుంది.