Share News

పురోగతిలో దక్షిణ కోస్తా రైల్వే

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:11 AM

నాలుగు డివిజన్లతో కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అతి తక్కువ కాలంలో గణనీయమైన పురోగతి దిశగా వెళుతోందని జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ పేర్కొన్నారు.

పురోగతిలో దక్షిణ కోస్తా రైల్వే

అతితక్కువ కాలంలో గణనీయమైన అభివృద్ధి

స్వాతంత్య్ర దినోత్సవంలో జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌

విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

నాలుగు డివిజన్లతో కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అతి తక్కువ కాలంలో గణనీయమైన పురోగతి దిశగా వెళుతోందని జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ పేర్కొన్నారు. శనివారం నగరంలోని రైల్వే క్రికెట్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే గరుడుబిల్లి, గుల్లిపాడు వద్ద అత్యాధునిక డివిజనల్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలు, మూడు లెవెల్‌ క్రాసింగ్‌ గేట్లకు ఇంటర్‌ లాకింగ్‌, 114.2 కి.మీ మేర ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామన్నారు. అలాగే ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ఇప్పటివరకూ 719 లోకోలకు ‘కవచ్‌’ వ్యవస్థను అమర్చడంతోపాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ విధానం అమలు చేస్తున్నామన్నారు. కాగా ప్రయాణికుల మౌలిక సదుపాయాలు, రైల్వే కార్యాలయాలు, ఇతర నిర్మాణ పనులకు సంబంధించి జోన్‌వ్యాప్తంగా ప్రస్తుతం రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అభివృద్ధి, ప్రణాళిక దశలో ఉన్నాయన్నారు. ఇక ప్రయాణికుల అవసరార్థం నాలుగు జతల ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌ సర్వీసులుగా అందుబాటులోకి తెచ్చామన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 76 ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు పలు రైళ్లకు అదనపు కోచ్‌లు జత చేశామన్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రదర్శించిన కార్యక్రమాలు, డాగ్‌ షో ఆకట్టుకున్నాయి.

Updated Date - Aug 16 , 2026 | 01:11 AM