Share News

ఖేదం...మోదం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:58 AM

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడం వంటి అంశాల్లో జిల్లా అధికార యంత్రాంగం కొన్నింటిలో మెరుగైన ఫలితాలు సాధించగా, మరికొన్నింటిలో పేలవ ప్రదర్శనతో వెనుకబడింది. మొత్తంగా చూస్తే మూడింట రెండు వంతుల సానుకూలత నమోదైంది.

ఖేదం...మోదం
అమరావతిలో నిర్వహించిన సదస్సు హాజరైన కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా

అధికార యంత్రాంగం పనితీరుపై మిశ్రమ స్పందన

పథకాలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవల్లో 70.9 శాతం సానుకూలత

క్రీడలు, పంచాయతీరాజ్‌, అగ్నిమాపక, రవాణా శాఖల సేవల్లో మెరుగైన ఫలితాలు

వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్య సేవల్లో తగ్గుదల.

అట్టడుగున సాగునీటి సేవలు

ఫైళ్ల క్లియరెన్స్‌, పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో అలసత్వం

స్ర్తీశక్తి పథకం ద్వారా 2,19,59,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం

కలెక్టర్ల సదస్సులో జిల్లా యంత్రాంగం పనితీరుపై నివేదిక

అనకాపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడం వంటి అంశాల్లో జిల్లా అధికార యంత్రాంగం కొన్నింటిలో మెరుగైన ఫలితాలు సాధించగా, మరికొన్నింటిలో పేలవ ప్రదర్శనతో వెనుకబడింది. మొత్తంగా చూస్తే మూడింట రెండు వంతుల సానుకూలత నమోదైంది.

రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన వివిధ రంగాల పనితీరుపై గణాంకాలను విడుదల చేశారు. దీనికి ముందు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే..ఈసారి క్రీడలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీలు, డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్‌, తదితర సేవల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. అయితే ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో సేవలు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్తు, విద్య, వైద్య సేవల్లో తగ్గుదల నమోదైంది. సాగునీటి సేవలు అట్టడుగున వున్నాయి.

మెరుగుపడిన సేవలు

ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంపై జిల్లాకు 70.9 శాతం సానుకూలత నమోదైంది. క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) పనితీరు గతంలో 47.8 శాతం ఉండగా ఈసారి ఏకంగా 29.1 శాతం పెరిగి 76.9 శాతానికి చేరిది. పంచాయతీ సేవలు-సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో 56.7 శాతం నుంచి 69.1 శాతానికి (12.4 శాతం) పెరిగింది. ఫైర్‌ ఎన్‌ఓసీ సేవలు 90.4 నుంచి 94.7 శాతానికి, సారథి డ్రైవింగ్‌ లైసెన్సుల సేవలు 76.8 నుంచి 80.2 శాతానికి, వాహన రిజిస్ట్రేషన్లు 76.5 నుంచి 79.4 శాతానికి పెరిగాయి. కాలేజీ విద్య, ఆర్‌ఓఆర్‌ మ్యుటేషన్‌లు, రవాణా శాఖ పన్నుల వసూళ్లు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ, పారిశుధ్య సేవల్లో స్వల్ప పురోగతి కనిపించింది. ప్రసూతి సేవల్లో 81.9 నుంచి 82 శాతం మెరుగుదల నమోదైంది.

పేలవ ప్రదర్శన...

ప్రజలకు నేరుగా అందాల్సిన కొన్ని రకాల సేవల్లో పనితీరు తగ్గడం అధికారులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ సేవలు 61.6 నుంచి 43.4 శాతానికి పడిపోయాయి. ఇది జిల్లా గణాంకాల్లో అత్యధిక ప్రతికూల అంశం. ఇక వీధి దీపాలు, తాగునీటి సేవలు 74.8 నుంచి 63.8 శాతానికి (-11), ఇంధన సేవలు 73.8 నుంచి 64.7 శాతానికి (-9.1) తగ్గాయి. పాఠశాల విద్య 82.1 నుంచి 78.3 శాతానికి, పీహెచ్‌సీల సేవలు 73.2 నుంచి 69.7 శాతానికి, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లపౌ సంతృప్తి 81.3 నుంచి 88.3 శాతానికి తగ్గాయి. రేషన్‌ పంపిణీ, అన్న క్యాంటీన్లు, మహిళలపై నేరాల నియంత్రణ తదితర అంశాల్లో కూడా గతంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది. అన్న క్యాంటీన్‌లు 78.5 శాతం, మెప్మా 75 శాతం, బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 73 శాతం సంతృప్తిని నమోదు చేశాయి. సాగునీటి సేవలు 37.7 శాతంతో అట్టడుగున ఉండడం గమనార్హం.

ఫైళ్ల క్లియరెన్స్‌, అర్జీల పరిష్కారంలో వెనుకంజ

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు, ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం కావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. సమీక్షలు కాకుండా ఫలితాలే ప్రామాణికంగా తీసుకోవాలని సదస్సులో ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల వారీగా ఈ-ఆఫీస్‌ ఫైళ్ల పరిష్కారం, పెండెన్సీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ అంశాలను సమీక్షించారు. జూన్‌ 9 నుంచి సెప్టెంబరు 6 వరకు 3,800 వ్యక్తిగత ప్రజా ఫిర్యాదులు అందగా వీటిలో 2,601 ఫిర్యాదులను పరిష్కరించారు. 1,199 పెండింగ్‌లో వున్నాయి. పరిష్కరించిన ఫిర్యాదులపై ఆడిట్‌ సంతృప్తి 88 శాతంగా నమోదైంది. ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 6 వరకు నెల రోజుల్లో ప్రజల నుంచి 1,099 అర్జీలు అందాయి. వీటిలో 419 మాత్రమే పరిష్కరించగా.. 680 పెండింగ్‌లో ఉన్నాయి. నెలవారీ పరిష్కారాల్లో సంతృప్తి శాతం 50కి పడిపోయింది.

కౌశలం వేదిక ద్వారా జిల్లాలో 1,138 కంపెనీలు 4,973 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. జిల్లాల వారీగా పరిశ్రమల శాఖ ప్రకటించిన ఉద్యోగాల్లో అనకాపల్లి జిల్లా ముందు వరుసలో నిలిచింది.

స్త్రీశక్తి పథకం కింద 2025 ఆగస్టు 15 నుంచి 2026 ఆగస్టు 31 వరకు జిల్లాలో 219.59 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. జిల్లాలోని రెండు డిపోల్లో ఉన్న బస్సుల ద్వారా రోజుకు సగటున 57 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

అనంత అరణ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,04,408 మొక్కలు నాటాలన్నది లక్ష్యంకాగా ఇప్పటివరకు 70,607 మొక్కలు నాటారు.

నెజ్‌ జీరో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భవనాలపై 1.41 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లను ఈ ఏడాది డిసెంబరులోగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వర్షపు నీటిని సంరక్షించేందుకు జిల్లాలో 60 కమ్యూనిటీ సోక్‌పిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యగా పెట్టుకోగా 68కి అంచనాలు రూపొందించి, 52 మంజూరు చేయగా.. వీటిలో 52 పూర్తిచేశారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ఇవి దోహదపడుతున్నాయి.

అక్షరాంధ్ర కార్యక్రమంలో 1,01,086 మంది వయోజనులను అక్ష్యరాస్యులుగా చేయాలని లక్ష్యాన్ని పెట్టుకోగా 1,01,862 మందిని అక్షరాస్యులను చేశారు.

స్వల్పంగా తగ్గిన నేరాలు

పెరిగిన ఆర్థిక, సైబర్‌ మోసాలు

అట్రాసిటీ, ఎన్‌డీపీఎ్‌స కేసులు తగ్గుముఖం

అనకాపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆర్థిక, సైబర్‌ మోసాలు పెరగ్గా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎన్‌డీపీఎ్‌స కేసులు తగ్గుముఖం పట్టాయి. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు శుక్రవారం సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హా జిల్లాలో నేరాలపై నివేదికను సమర్పించారు. 2025 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు జిల్లాలో వివిధ రకాల నేరాలకు సంబంధించి 2.070 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,193 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది 123 కేసులు (5.6 శాతం) తగ్గాయి.

జిల్లాలో సైబర్‌ నేరాలు స్వల్పంగా పెరిగాయి. 2024-25 లో 1,807 సైబర్‌ కేసులు నమోదుకాగా, 2025-26లో 1,888 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 4.5 శాతం పెరిగాయి.

ఆర్థిక నేరాలు 35.9 శాతం పెరిగాయి. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు జిల్లాలో 78 ఆర్థిక నేరాలు జరగ్గా.. 2025 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు 106 నేరాలు నమోదయ్యాయి.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు తగ్గాయి. జల్లాలో 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 32 కేసులు నమోదుకాగా, 2025 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు 28 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 12.5 శాతం తగ్గాయి.

గంజాయి, మత్తు పదార్థాల కేసులు గణనీయంగా తగ్గాయి. జల్లాలో 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు 169 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదుకాగా, 2025 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు 107 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 36.7 శాతం తగ్గాయి.

Updated Date - Sep 12 , 2026 | 12:58 AM