Share News

రామవరం కొండపై శొంఠ్యాం ముఠా కన్ను

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:58 AM

ఆనందపురం మండలం శొంఠ్యాంలో గల కొండపై ఆక్రమణలకు పాల్పడిన ముఠా ఇప్పుడు రామవరంపై కన్నేసింది.

రామవరం కొండపై శొంఠ్యాం ముఠా కన్ను

ఆక్రమణదారులపై ఒత్తిడి తెచ్చి భూములు కొనుగోలు

ఎకరాకు రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు అడ్వాన్స్‌

ఆ పక్కనున్న భూముల కబ్జాకు ప్లాన్‌

విశాఖపట్నం/ఆనందపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం శొంఠ్యాంలో గల కొండపై ఆక్రమణలకు పాల్పడిన ముఠా ఇప్పుడు రామవరంపై కన్నేసింది. రామవరం సర్వే నంబర్‌ 121, గంగసాని అగ్రహారంలోని సర్వే నంబర్‌-1లో ఎంఐజీ ప్లాట్ల కోసం వీఎంఆర్డీఏ సేకరించిన భూమికి ఆనుకుని గల కొండపై రైతుల ఆధీనంలో సుమారు 50 ఎకరాల కొనుగోలుకు అడ్వాన్స్‌లు ఇచ్చింది. ఆ భూములను అడ్డం పెట్టుకుని కొండపై మరికొంత భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తోంది.

నాలుగేళ్ల క్రితం ఎంఐజీ ప్లాట్ల కోసం రామవరం, గంగసాని అగ్రహారం ప్రాంతాల్లో 260 ఎకరాలు డీపట్టా భూములను వీఎంఆర్‌డీఎ సమీకరించింది. డీపట్టా రైతులకు 900 గజాల ప్లాటు, రెవెన్యూ రికార్డుల్లో ఆక్రమణదారుడిగా గుర్తించిన రైతులకు 450 గజాల ప్లాటు ఇస్తారు. కొండ చుట్టూ ఉన్న 260 ఎకరాల్లో లేఅవుట్‌ వేసిన వీఎంఆర్‌డీఏ...ప్రస్తుతం రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు చేపట్టింది.

రామవరం కొండ చుట్టూ డీపట్టా రైతులకు చెందిన భూముల పక్కన కొందరు సుమారు 50 ఎకరాల్లో తోటలు వేసుకుని చాలాకాలం నుంచి సాగులో ఉన్నారు. ప్రస్తుతం ఆ భూములను వీఎంఆర్‌డీఏ తీసుకోలేదు. ఇప్పుడు వాటిపై శొంఠ్యాంలో కొండపై కబ్జాకు తెగబడిన ముఠా కన్నుపడింది. రైతుల ఆక్రమణలో ఉన్న భూముల కొనుగోలుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అడ్వాన్స్‌లు ఇస్తోంది. తోటలు సాగుచేస్తున్న రైతుల్లో కొందరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఆక్రమణదారులుగా ఉండగా, మరికొందరు పేర్లు లేవు. భవిష్యత్తులో వీఎంఆర్‌డీఏకు రైతుల ఆక్రమణల్లో ఉన్న తోటలు అవసరమవుతాయని ఈ ముఠా భావిస్తోంది. అందుకే అడ్వాన్స్‌లు ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన తరువాత ఆ భూములకు ఆనుకుని మరికొంత ఆక్రమించుకుని రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదుచేసుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మండలంలో తాము చెబితే కాదనే పరిస్థితి లేదని ఈ ముఠాలో కొందరు సభ్యులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ముఠాలో కీలక వ్యక్తి గతంలో వైసీపీలో ఉండేవారని, ఇప్పుడు కూటమి పార్టీలో చేరి రామవరం, శొంఠ్యాం ప్రాంతాల్లో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆనందపురం టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వల్ల కూటమికి చెడ్డపేరు వస్తోందని, రామవరం, శొంఠ్యాంలలో వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:58 AM