Share News

బస్సు ప్రయాణికుల పాట్లు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:28 PM

జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం వలన మండల వాసులకు బస్‌ షెల్టర్లు లేకుండాపోయాయి.

బస్సు ప్రయాణికుల పాట్లు
ఎం.మాకవరం పంచాయతీ నడింపాలెం కూడలిలో ఎండలో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

బస్‌ షెల్టర్లు లేక అవస్థలు

మూడేళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మాణ సమయంలో తొలగింపుతో కష్టాలు

ఎండైనా, వానైనా ఇబ్బందులు పడుతూ పడిగాపులు

కొయ్యూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం వలన మండల వాసులకు బస్‌ షెల్టర్లు లేకుండాపోయాయి. సుమారు 50 గ్రామాలకు ప్రధాన కూడళ్లు అయిన కాకరపాడు, ఎం.మాకవరం పంచాయతీ నడింపాలెం బస్‌ షెల్టర్లు లేక గత మూడేళ్లుగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మూడేళ్ల క్రితం జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా బస్‌ షెల్టర్లను తొలగించారు. కాకరపాడు కూడలి నుంచే నర్సీపట్నం, కొయ్యూరు, ఏలేశ్వరం, రాజమహేంద్రవరం, రంప చోడవరం, మారేడుమిల్లి, తదితర సుదూర ప్రాంతాలతో పాటు మండలానికి చెందిన 10 పంచాయతీలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఎం.మాకవరం పంచాయతీ పరిధి 10 గ్రామాలకు నడింపాలెం కూడలి నుంచి వెళుతుంటారు. గతంలో ఇక్కడ బస్‌ షెల్టర్లు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఉండేవి కాదు. అయితే మూడేళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మాణం కోసం ఈ షెల్టర్లను తొలగించడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఎండైనా, వానైనా ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. కాగా జాతీయ రహదారి నిర్మాణ సమయంలో బస్‌ షెల్టర్లను తొలగించిన కాంట్రాక్టర్‌ ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీనిపై కలెక్టర్‌ స్పందించి బస్‌ షెల్టర్ల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:28 PM