ప్రయాణానికి పాట్లు
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:58 AM
అవసరాలకు సరిపడ ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. అధికారులు ఈ మేరకు అదనపు సర్వీసులు ప్రవేశపెట్టలేదు.
స్ర్తీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో గణనీయంగా పెరిగిన ఓఆర్
రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు వేయని అధికారులు
ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్టాపుల వద్ద ప్రయాణికుల పడిగాపులు
అనకాపల్లి టౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అవసరాలకు సరిపడ ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. అధికారులు ఈ మేరకు అదనపు సర్వీసులు ప్రవేశపెట్టలేదు. దీంతో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు కిక్కిరిసిపోవడమే కాకుండా, ఆర్టీసీ కాంప్లెక్సులు, ఇతర బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులుకాయాల్సి వస్తున్నది. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఈ తరహా సన్నివేశాలు నిత్యకృత్యం అయ్యాయి. సాధారణ ప్రయాణికులతోపాటు విద్యార్థులు సైతం బస్సుల కోసం చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్లాట్‌ఫారం వద్దకు బస్సు వచ్చిందే తడవుగా పదుల సంఖ్యలో ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. పల్లెవెలుగు బస్సులో సీట్లలో కూర్చుని సుమారు 50 మంది వరకు ప్రయాణించే అవకాశం వుంది. కానీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కో బస్సులో వంద మందికిపైగా ప్రయాణికులు వుంటున్నారని కండక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా చోడవరం, రావికమతం (వయా తట్టబంద), విజయనగరం, నర్సీపట్నం, పాయకరావుపేట వైపు వెళ్లే బస్సుల్లో ఇటువంటి పరిస్థితి అధికంగా వుంది. బస్సులో కనీసం నిల్చుని వెళ్లడానికి కూడా జాగా లేకపోవడంతో విద్యార్థినులు మరో బస్సు కోసం వేచివుంటున్నారు. విద్యార్థులు అయితే ఏదోలా బస్సు ఎక్కి ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినప్పటికీ.. మరో మార్గం లేదని వారు అంటున్నారు. స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్ గణనీయంగా పెరిగిందని డిపో మేనేజర్ నుంచి జోన్ ఈడీ వరకు తరచూ చెబుతున్నారని, కానీ ఇందుకు అనుగుణంగా బస్సులను మాత్రం పెంచలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పీటీడీ ఉన్నతాధికారులు స్పందించి, పెరిగిన ఓఆర్‌కు అనుగుణంగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.