Share News

పరాయి పంచన పాట్లు

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:59 AM

మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి చాలకపోవడంతో అధికారులు, విద్యార్థుల ప్రవేశాలను సగానికి కుదించారు.

పరాయి పంచన పాట్లు
బీసీ గురుకుల పాఠశాల నిర్వహిస్తున్న ప్రైవేటు భవనం

ఐదేళ్ల నుంచి అద్దె భవనంలో బీసీ బాలుర గురుకుల పాఠశాల

లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ నిల్‌

వసతి చాలక ప్రవేశాలను తగ్గించిన నిర్వాహకులు

సొంత భవనాలకు స్థలం కేటాయించని వైనం

నర్సీపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏళ్ల తరబడి అద్దె భవనంలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి చాలకపోవడంతో అధికారులు, విద్యార్థుల ప్రవేశాలను సగానికి కుదించారు.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు 2018లో ఉమ్మడి విశాఖ జిల్లాకుఎనిమిది బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం, అనకాపల్లిలో బాలురకు, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గం ఎస్‌.రాయవరానికి బాలికల వసతి గురుకుల పాఠశాలలను కేటాయించారు. మాకవరపాలెంలో గురుకుల పాఠశాలకు సరిపడ ప్రభుత్వ భవనం, అద్దె భవనం అందుబాటులో లేకపోవడంతో పెదబొడ్డేపల్లిలో ఖాళీగా ఉన్న మునిసిపల్‌ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సి రావడంతో బలిఘట్టం బైపాస్‌ రోడ్డు శారదానగర్‌లో ప్రైవేటు అద్దె భవనం తీసుకొని బీసీ గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో ఈ పాఠశాలకు స్థలం మంజూరుకు అధికారులు కనీస ప్రయత్నం చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా అదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఏడేళ్ల క్రితం పాఠశాల ప్రారంభం

మహాత్మా జ్యోతిరావుఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను 2019-20 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలకు ఎనిమిది తరగతి గదులు, 14 హాస్టల్‌ గదులు వున్నాయి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ బోధిస్తారు. వాస్తవంగా ప్రతి తరగతిలో 80 మంది విద్యార్థులు వుండాలి. 2025-25 విద్యా సంవత్సరం వరకు ఐదో తరగతిలో 80 మంది చొప్పున చేర్చుకున్నారు. అయితే వసతి చాలకపోవడంతో 2026-27లో 40 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 5 నుంచి 10వ తరగతి వరకు 320 మంది విద్యార్థులు వున్నారు.

క్రీడా మైదానం లేక విద్యార్థుల అవస్థలు

క్రీడా మైదానం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం విద్యార్థులను జోగినాథునిపాలెం రోడ్డులోని ఖాళీ స్థలం వద్దకు తీసుకువెళ్లి ఆడిస్తున్నారు. లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాలు లేవు. డైనింగ్‌ హాల్‌ లేకపోవడంతో విద్యార్థులు నేల మీద కుర్చొని భోజనం చేస్తున్నారు. ఆరుబయట ఖాళీ స్థలం లేకపోవడంతో ఉతికిన దుస్తులను మూడో అంతస్థు మేడ మీద ఆర బెట్టుకుంటున్నారు. ఇటీవల ఆర్వో ప్లాంట్‌ పాడైపోవడంతో బయట నుంచి క్యాన్ల నీటిని తెప్పిస్తున్నారు. బీసీ బాలుర గురుకుల పాఠశాలకు నాలుగు ఎకరాల భూమి అవసరమని అధికారులు అంటున్నారు. సొంత భవనం నిర్మించే వరకు విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని, అదే విధంగా నాణ్యమైన విద్య (లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ లేకపోవడం) అంతంతమాత్రంగానే అందుతుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:59 AM