చేపల వేటకు వెళ్లి ఒకరి గల్లంతు
ABN , Publish Date - May 21 , 2026 | 11:54 PM
మత్స్యగెడ్డలో చేపల వేటకు వెళ్లి గురువారం ఒకరు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు(34) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు.
- మత్స్యగెడ్డ ఊబిలో కూరుకుపోయిన కుమారుడు, మేనల్లుడిని రక్షించి కొట్టుకుపోయిన వైనం
పెదబయలు, మే 21 (ఆంధ్రజ్యోతి): మత్స్యగెడ్డలో చేపల వేటకు వెళ్లి గురువారం ఒకరు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావు(34) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఒడిశా పాడువాలో జరిగిన వారపు సంతకు వెళ్లి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం తన కుమారుడు వంతాల వరుణ్(10), మేనల్లుడు పసుపుల సాత్విక్(8)లతో కలిసి చేపల వేటకు స్థానిక మత్స్యగెడ్డకు వెళ్లాడు. ఏవోబీ వంతెన కిందవైపు నుంచి చేపలు పట్టుకొని వచ్చారు. ఇంతలో వంతెన కిందకు వచ్చేసరికి ఊబిలో సాత్విక్ కూరుకుపోయాడు. అది గమనించిన వరుణ్ అతనిని రక్షించేందుకు వెళ్లి తాను కూడా ఊబిలో కూరుకుపోయాడు. దూరంగా ఉన్న నాగేశ్వరరావు గమనించి మునిగిపోతున్న మేనల్లుడిని ఒడ్డుకు చేర్చి, అనంతరం అతి కష్టం మీద కుమారుడిని వేరే వైపు ఒడ్డుకు చేర్చి అలసిపోయి, నీరసించి ఒడ్డుకు చేరుదామనే క్రమంలో గల్లంతైపోయాడు. అది గమనించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి స్థానిక ఎంపీడీవో ఎస్.డి.శ్యామ్‌సుందర్, తహశీల్దార్ త్రినాథరావునాయుడు ఘటనా స్థలానికి చేరుకొని నాటు పడవ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు గాలించినా నాగేశ్వరరావు ఆచూకీ లభించలేదు. నాగేశ్వరరావుకు భార్య రాజేశ్వరి, పిల్లలు ప్రవళిక, వరుణ్, చంద్రిక ఉన్నారు. గెడ్డ ఒడ్డున నాగేశ్వరరావు భార్య రాజేశ్వరి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది.