తగ్గించాలని కొందరు... పెంచాలని ఇంకొందరు
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:16 AM
భూముల విలువల పెంపుపై జిల్లాలో 30 వరకూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
భూముల విలువల పెంపుపై జిల్లాలో 30 వరకూ అభ్యంతరాలు
క్షేత్రస్థాయిలో మరోసారి కమిటీ పరిశీలన
గ్రీన్‌సిటీ, శాలిగ్రామపురంలో రేట్లు తగ్గించలేమని స్పష్టీకరణ
కమిటీ కన్వనర్‌కు సబ్ రిజిస్ట్రార్ల సిఫారసులు
రేపటి నుంచి కొత్త ధరలు అమలు
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
భూముల విలువల పెంపుపై జిల్లాలో 30 వరకూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ధరలు తగ్గించాలని కోరితే, మరికొందరు తమ ప్రాంతంలో భూముల విలువ తక్కువగా ఉందని తప్పనిసరిగా పెంచాలని కోరడం గమనార్హం. వీటన్నింటినీ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో కూడిన కమిటీ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అందుకు అనుగుణంగా సిఫారసులు చేసింది. వీటిని కమిటీ కన్వీనర్ అయిన జాయింట్ కలెక్టర్‌కు సమర్పించి, అక్కడ తీసుకున్న నిర్ణయం అమలు చేస్తారు. ఈ కొత్త ధరలు వచ్చే నెల ఒకటో తేదీ (ఆదివారం) నుంచి అమలులోకి వస్తాయి.
ఎక్కడెక్కడ అభ్యంతరాలు వచ్చాయంటే...
- ఆనందపురం మండలం గంభీరంలో జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న సర్వే నంబర్లు 157, 158, 159, 160లలో ఎకరా ధరను 2023లో రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు పెంచారు. ఇప్పుడు అక్కడకు సమీపంలో ఉన్న భూములకు విలువ పెరిగినందున ఆ మేరకు రేటు పెంచాలని విజ్ఞప్తి రాగా దానికి కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది.
- ఆనందపురం మండలం గిడిజాలలో సర్వే నంబర్లు 940, 897, 105/7, 83/2లలో భూముల విలువ పెంచాలని కొందరు కోరారు. ఈ గ్రామం జాతీయ రహదారికి ఎనిమిది కి.మీ. దూరాన ఉందని, అంతా వ్యవసాయమే జరుగుతున్నదని, అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి అభివృద్ధి లేనందున రేట్లు పెంచలేమని కమిటీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
- చిప్పాడ గ్రామంలో భూములు ధరలు పెంచాలని పలువురు కోరగా, అక్కడ దివీస్ లేబొరేటరీ పారిశ్రామిక కాలుష్యం ఉన్నందున రేట్లు పెంచలేమని కమిటీ అభ్యర్థనను తోసిపుచ్చింది.
- దొండపర్తి గ్రామం పరిధిలోకి వచ్చే సర్వే నంబర్లు 222, 223/ఏ, 224లలో భూమి ధర చదరపు గజం రూ.62 వేలకు పెంచారని, దానిని రూ.40 వేలకు తగ్గించాలని సర్దార్ ఇన్‌ఫ్రా సంస్థ కోరింది. శాలిగ్రామపురం, శ్రీనివాసనగర్, పోర్టు క్వార్టర్స్ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ.90 వేలు వరకు ఉన్నందున రేటు తగ్గించలేమని కమిటీ స్పష్టం చేసింది.
- గాజువాక గ్రీన్ సిటీలో సర్వే నంబర్లు 9, 10, 11, 12, 13, డోర్ నంబర్లు 1-51-5లో చ.గజం ధర రూ.18 వేలు నుంచి రూ.14 వేలకు తగ్గించాలని వైజాగ్ ప్రొఫైల్స్ తరపున బి.సురేశ్ దరఖాస్తు చేశారు. తుంగ్లాంలో గజం ధర రూ.25 వేలు నుంచి రూ.30 వేలు మార్కెట్ ధర ఉన్నందున రేటు తగ్గించే అవకాశం లేదని కమిటీ సిఫారసు చేసింది.
- చినముషిడివాడ టీచర్స్ లేఅవుట్, పెందుర్తి మండలం సౌభాగ్యపురంలో భూముల ధరలు తగ్గించాలని అభ్యర్థనలు రాగా వాటిని పరిశీలించి తగ్గిస్తామని కమిటీ పేర్కొంది.
- ధారపాలెం, ముడసర్లోవ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవని, గజం రేటు రూ.17 వేలు పెట్టారని, తగ్గించాలని పలువురు కోరగా, అక్కడ బహిరంగ మార్కెట్‌లో రేటు ఎక్కువగానే ఉందని, రేటు తగ్గించలేమని కమిటీ పేర్కొంది.
ఫొటోలు వీఎంఆర్‌డీఏ అని ఉన్నాయి.
రైటప్: ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్‌పై చర్చిస్తున్న పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్ తదితరులు.
రేపటి నుంచి ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ కింద రోటరీ మూసివేత
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
ఎన్‌ఏడీ జంక్షన్‌లో రోడ్ ఓవర్ బ్రిడ్జి, కాకానినగర్ వద్ద అండర్ పాస్ పనులు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ కింద రోటరీని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మూసివేయనున్నట్టు వీఎంఆర్‌డీఏ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇక్కడ జరుతున్న పనులను చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్‌భరత్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అలా చేయాలనుకుంటే ట్రాఫిక్‌ను మళ్లించాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలపడంతో వెంటనే పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో మాట్లాడారు. ఆయన ఎన్‌ఏడీ జంక్షన్‌కు వెళ్లి వారితో కలిసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఫ్లైఓవర్ పైన, కింద కూడా ట్రాఫిక్ నడిస్తే ఇబ్బందులు వస్తాయని, కింద రోటరీలో ట్రాఫిక్ కొద్దిరోజులు ఆపితే పనులు వేగంగా చేసుకోవచ్చునని సూచించారు. దాంతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఫ్లైఓవర్ కింది నుంచి ఎటువంటి వాహనాలు అనుమతించబోమని, పైన రోటరీ నుంచి అన్ని వాహనాలు రాకపోకలు సాగించాలని వీఎంఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఈ వినయ్‌కుమార్, ఈఈ మధుసూదనరావు, ట్రాఫిక్ ఏసీపీ ఎస్.వాసుదేవ్, సీఐ దాశరథి తదితరులు పాల్గొన్నారు.