ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:10 AM
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ప్రకారం జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లను పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు.
పది వేల మందికిపైగా సిబ్బంది సిద్ధం
జీవీఎంసీ పరిధిలో 28న పోలింగ్
120 వార్డుల్లో 1,990 కేంద్రాలు
మేయర్‌కు గులాబీ రంగు, కార్పొరేటర్‌కు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్
30న ఏయూలో ఓట్ల లెక్కింపు
నాలుగు జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు నవంబరు మూడున ఎన్నికలు
5న ఫలితాలు
అనంతరం 79 గ్రామ పంచాయతీల ఎన్నికలు
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్ 180042500009
బందోబస్తుకు 6,607 మంది సిబ్బంది: పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ
విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ప్రకారం జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లను పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో 1,990 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 28వ తేదీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి ఏయూలోని స్ర్టాంగ్‌రూమ్‌లకు తరలిస్తామన్నారు. తొమ్మిది భవనాల్లో స్ర్టాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. 30న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు పది వేలకుపైగా సిబ్బందిని గుర్తించి మొదటి విడత శిక్షణ పూర్తిచేశామన్నారు. జిల్లాలో అత్యంత సీనియర్లు, ఎన్నికల విధుల్లో అనుభవం కలిగిన 41 మందిని రిటర్నింగ్ అధికారులు, మరో 41 మందిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. పోలింగ్ సిబ్బందిని కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. కీలక, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన అదనపు భద్రతా ఏర్పాట్లుచేశామన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేసి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు తేదీని ప్రకటిస్తామన్నారు.
అలాగే జిల్లాలో నాలుగు జెడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు 19న నోటిఫికేషన్ వస్తుందని, నవంబరు మూడున పోలింగ్, ఐదున ఓట్ల లెక్కింపు జరుగుతాయన్నారు. నాలుగు మండలాల పరిధిలో 1,72,980 మంది ఓటర్లు ఉన్నారని, 106 ప్రాంతాల్లో 203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు నాలుగు ఎంసీసీ బృందాలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు స్టాటిక్ సర్వై లెన్స్ బృందాలు, రెండు వీడియోగ్రఫీ బృందాలు, వ్యయ పరిశీలనకు ఐదు బృందాలు, అనుమతులు జారీకి ఐదు సింగిల్ విండో క్లియరెన్స్ డెస్క్‌లు ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. దీనికోసం 802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం 180042500009 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుచేశామన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 9989891827 నంబర్ అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు సిద్ధం చేశామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌కు గులాబీ రంగు, కార్పొరేటర్‌కు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచామన్నారు. రెండు బ్యాలెట్లను ఒకే బాక్స్‌లో వేయాల్సి ఉంటుందన్నారు.
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు పటిష్ట బందోబస్తు, ప్రత్యేక గస్తీ బృందాలు, చెక్పాయింట్లు, పర్యవేక్షణ బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఎన్నికలకు 6,607 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. మొత్తం 177 రూట్ మొబైల్స్, 16 స్టాటిక్ సర్వై లెన్స్ టీమ్‌లను ఏర్పాటుచేశామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 2,907 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తామన్నారు. నగర పరిధిలో 600 లైసెన్స్ తుపాకీలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 200 వరకు డిపాజిట్ చేశారని, మిగిలినవి బ్యాంక్‌ల విజ్ఞప్తి మేరకు పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.