తూర్పు తీరాన సౌర వెలుగులు
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:18 AM
ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో అత్యధికంగా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశామని సీఎండీ పృథ్వీతేజ్ వెల్లడించారు.
ఈపీడీసీఎల్ పరిధిలో 88,561 రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు
475 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం
సీఎండీ పృథ్వీతేజ్ వెల్లడి
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో అత్యధికంగా రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశామని సీఎండీ పృథ్వీతేజ్ వెల్లడించారు. గురువారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఏడాది జూన్ 30 నాటికి సంస్థ పరిధిలో 88,561 మంది వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 475.33 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానం చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 51,583 సోలార్ యూనిట్ల ద్వారా 197.09 మెగావాట్లను గ్రిడ్‌కు ఇచ్చి రికార్డు నెలకొల్పామని వెల్లడించారు. 2022-23లో 864 సోలార్ యూనిట్ల ద్వారా 17.39 మెగావాట్లు, 2023-24లో 980 యూనిట్ల ద్వారా 30 మెగావాట్లు, 2024-25లో 8,307 యూనిట్ల ద్వారా 70.25 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంఽధానం చేశామని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహక పథకాలు దీనికి దోహదపడ్డాయన్నారు. రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు పెట్టుకునేవారికి సాంకేతిక సహకారం, గ్రిడ్ అనుసంధానం, నెట్ మీటరింగ్ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఒక కిలోవాట్‌కు రూ. 30 వేలు, రెండు కిలోవాట్లకు రూ. 60 వేలు, మూడు కిలోవాట్లకు రూ. 78 వేలు రాయితీ లభిస్తుందన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలలో అర్హులైన వారికి రెండు కిలోవాట్ల వరకు ఉచితంగా యూనిట్లు పెడుతున్నామని చెప్పారు. సంస్థ పరిధిలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఏలూరు వరకు వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.