Share News

పడకేసిన సోలార్‌ ప్రాజెక్టు!

ABN , Publish Date - May 23 , 2026 | 12:36 AM

సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జీవీఎంసీ మూడేళ్ల కిందట రూ.11 కోట్లతో కృష్ణాపురం, ముడసర్లోవ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానళ్లు మూలకుచేరాయి.

పడకేసిన సోలార్‌ ప్రాజెక్టు!

మూడేళ్ల కిందట రూ.11 కోట్లతో కృష్ణాపురం, ముడసర్లోవ వద్ద ప్లాంట్లు

ఒప్పందాన్ని అతిక్రమించి నిర్వహణ నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్‌

మూడేళ్లుగా పనిచేయని ప్లాంట్లు

పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

కాంట్రాక్టర్‌పై చర్యలు విస్మరించి...ఇప్పుడు మెయింటెనెన్స్‌ వేరొకరికి అప్పగించేందుకు టెండర్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జీవీఎంసీ మూడేళ్ల కిందట రూ.11 కోట్లతో కృష్ణాపురం, ముడసర్లోవ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానళ్లు మూలకుచేరాయి. ప్లాంట్లు ఏర్పాటుచేసిన తరువాత పదేళ్లపాటు వాటి నిర్వహణ చూడాల్సిన కాంట్రాక్టర్‌ ముఖం చాటేయడంతో ప్యానళ్లు, కేబుల్‌ వైర్లు పాడైపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు...ఆ విషయం వదిలేసి నిర్వహణకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు సమాయత్తమవుతుండడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీకి చెందిన కార్యాలయాలు, నీటి సరఫరా రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, యూజీడీ నెట్‌వర్క్‌ పంప్‌హౌస్‌లు, ఎస్‌టీపీల నిర్వహణకు భారీగా విద్యుత్‌ అవసరమవుతుంది. అందుకోసం ఈపీడీసీఎల్‌కు ప్రతి నెలా రూ.రెండు కోట్లు వరకు విద్యుత్‌ చార్జీలుగా చెల్లించేది. సౌర విద్యుదుత్పత్తి కోసం జీవీఎంసీకి చెందిన భారీ భవనాలతోపాటు రిజర్వాయర్లు, ఖాళీ భూముల్లో ప్యానల్స్‌ ఏర్పాటుచేస్తే బిల్లు భారం తగ్గుతుందనే భావనతో అధికారులు పదేళ్ల కిందటి నుంచే ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ముడసర్లోవ రిజర్వాయర్‌లో రెండు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటును ఏర్పాటుచేశారు. దీనికి ప్రశంసలు లభించడంతో జీవీఎంసీ సొంత నిధులతో ప్రధాన కార్యాలయం, ఇతర భవనాలపై రూ.ఏడు కోట్ల వ్యయంతో మరో 1.7 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటుచేసింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఈపీడీసీఎల్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేసి, అక్కడి నుంచి అంతే విద్యుత్‌ను జీవీఎంసీ ఉచితంగా వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకుంది. సోలార్‌ విద్యుదుత్పత్తి వల్ల జీవీఎంసీకి ఆర్థికంగా వెసులుబాటు కనిపించడంతో కృష్ణాపురంలోని ఆరు ఎకరాల్లో 1.5 మెగావాట్లు, ముడసర్లోవ రిజర్వాయర్‌ ఎదురుగా ఉన్న నాలుగు ఎకరాల ఖాళీ భూమిలో 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానళ్లను 2023లో ఏర్పాటుచేశారు. దీనికోసం రూ.11 కోట్లు జీవీఎంసీ వెచ్చించింది. ఆ బాధ్యత తీసుకున్న సంస్థ 2024లో ప్లాంట్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్లాంట్ల నిర్వహణ పదేళ్లపాటు చూసేలా ఆ సంస్థతో జీవీఎంసీ అధికారులు టెండర్‌ అప్పగింత సమయంలోనే ఒప్పందం చేసుకున్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు, నిర్వహణకు నిధులు కేటాయింపులు చేశారు. ప్లాంట్ల నిర్వహణ అంటే...గార్డులు, పవర్‌హౌస్‌ల ఆపరేటర్లు నియామకం, మోటార్‌ల మరమ్మతు వంటివి ఉంటాయి. ప్లాంటు నిర్వహణకు టెండర్‌లో పేర్కొన్న మొత్తంలో పెద్దగా మిగలదేమోనని భావించిన కాంట్రాక్టర్‌...‘గ్రౌండింగ్‌’కు అయిన బిల్లు చేసుకుని వెళ్లిపోయాడు. ప్లాంట్ల నిర్వహణ లేకపోవడంతో కొంతకాలంగా కృష్ణాపురం ప్లాంటు పూర్తిగా, ముడసర్లోవ ప్లాంటు 90 శాతం పనిచేయడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించాల్సిన అధికారులు...ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టని అధికారులు ప్లాంట్ల నిర్వహణకు తిరిగి టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఉదాసీనత కారణంగా కోట్ల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది.

Updated Date - May 23 , 2026 | 12:36 AM